CM KCR vs PM Modi : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. మోడీ, కేసీఆర్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రెండువైపుల నుంచి ఘాటైన విమర్శలు, ప్రతివిమర్శలు వస్తున్నాయి. సందర్భం ఏదైనా టార్గెంట్ మోడీ అనే సింగిల్ పాయింట్ అజెండాతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అటు మోడీ డైరక్టుగా కేసీఆర్ ను టార్గెట్ చేయకపోయినా.. బీజేపీ నేతలు మాత్రం తీవ్ర ఆరోపణలతో అగ్గి రాజేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలతో మొదలైన రాజకీయ వేడి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి తారస్థాయికి చేరే అవకాశాలున్నాయి.
సభ ఏదైనా.. సందర్భం ఏమైనా.. కేసీఆర్ టార్గెట్ మోడీ అంటున్నారు. సింగిల్ పాయింట్ అజెండాను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు మోడీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా ప్రధానే తెలంగాణ శత్రువు అని ప్రకటించారు. బీజేపీ అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి రావాలనే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేసే ఉద్దేశంలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా ప్రధాని కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు సీఎం కేసీఆర్. అయితే దీనికి కారణం ఏంటి ? ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ణయం వల్లే ఇలా జరుగుతోందా? లేక కేసీఆర్ కావాలనే మోడీ మీటింగ్‌లను దూరం పెడుతున్నారా? అనే ప్రశ్నలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు సూటిగా సమాధానాలిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహపూరిత వాతావరణం అభివృద్ధికి దోహదం చేస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో గానీ, కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం చాలా అవసరం. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని సీఎం కేసీఆర్, మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య సఖ్యత కొరవడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ వ్యూహాల్ని గమనిస్తున్న కేసీఆర్.. ప్రధాని మోడీపై నేరుగా యుద్ధం ప్రకటించారు. తెలంగాణకు మోడీనే అసలైన శత్రువు అని చేసిన ప్రకటన కలకలం రేపింది.
కరోనా ఫోర్త్ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. అయితే ఈ వీడియోకాన్ఫరెన్స్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. CJI జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి కూడా కేసీఆర్ హాజరుకాలేదు.
హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని మోడీ వచ్చిన కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో గత మూడు నెలలుగా ప్రధాని మోడీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. మోడీపై తనకు ఉన్న వ్యతిరేకతను కేసీఆర్ ఎక్కడా దాచుకోవడం లేదు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రధాని వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు చేష్టల ద్వారా కూడా చెబుతున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని అన్ని రాష్ట్రాలూ కేంద్రం కార్యాచరణకు అనుగుణంగా నిర్వహించాయ. కానీ తెలంగాణ సర్కారు మాత్రం కేంద్రానికి సమాంతరంగా ఉత్సవాలు జరిపింది. ఆగస్ట్ 16న సామూహిక జాతీయ గీతాలాపనతో తన ప్రత్యేకతను చాటుకుంది. మోడీని ఎదిరించే సాహసం చేయడానికి దేశంలో ఏ నేతా రెడీగా లేని స్థితిలో.. కేసీఆర్ మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ కార్యక్రమాలకు తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేసీఆర్ వర్సెస్ మోడీ అన్నట్టుగానే ఉంది. బీజేపీ సమావేశం కోసం హైదరాబాద్ కు వచ్చిన మోదీకి అడుగడుగునా కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. తెలంగాణకు ఢిల్లీ నుంచి మిడుతల దండు వస్తోంది. ఆకుపచ్చని తెలంగాణను నాశనం చేయడానికి వస్తున్న మిడుతల దండును తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీపై వ్యతిరేకంగా ప్రచారాలు చేసింది.
హైదరాబాద్ లో అయితే ఇక చెప్పక్కర్లేదు.. ఎక్కడ చూసినా.. మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్సే. సరికొత్తగా టీఆర్ఎస్ పార్టీ మోదీపై నిరసనను తెలిపింది. మోడీ వస్తున్నారని తెలిసి.. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మోడీ.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలంటూ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా బీజేపీని లైట్ తీస్కున్న కేసీఆర్.. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని ఫిక్సైనట్టు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారం అండతోనే బీజేపీ దూకుడు చూపిస్తోందని గుర్తించిన కేసీఆర్.. సమాఖ్యవాదం పేరుతో కేంద్రం వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకే కాదు.. దేశానికి కూడా మోడీ ఏమీ చేయలేదని పదేపదే బలంగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బీజేపీకి వీలైనంత నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారు. మరోసారి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతల్ని కలిసే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. బీహార్ పరిణామాల తర్వాత సీన్ మారిందని గ్రహించారు కేసీఆర్. అందుకే మరో విడత జాతీయ నేతలతో భేటీ అయితే.. బీజేపీపై ఒత్తిడి పెరుగుతుందని ఆలోచిస్తున్నారు.
తాము సఖ్యతగా ఉండాలని ప్రయత్నించినా.. కేంద్రం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే కోణంలో వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తోంది. ప్రభుత్వాల మధ్య సహకారానికి, రాజకీయాలకు లింక్ పెట్టడం అనైతికం అనే యాంగిల్ ను కూడా పైకి తీస్తోంది. గతంలో ఇలాంటి రాజకీయాలు చేసినవాళ్లకు ఎలాంటి గతి పట్టిందో గుర్తంచుకోవాలని మండిపడుతోంది. టీమిండియా స్ఫూర్తి మాటల్లోనే కానీ.. చేతల్లో కనిపించడం లేదని ఉదాహరణలతో సహా కేంద్రాన్ని ఇరుకునపెడుతోంది. తెలంగాణను, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చి.. ఎక్కడ పాలన బాగుందో చూడాలని ప్రజల్ని కోరుతోంది. డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినేనని చెబుతోంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. అంతా తామే చేశామని కేంద్రం డబ్బా కొట్టుకుంటోందని టీఆర్ఎస్ గట్టిగా మాట్లాడుతోంది.
తెలంగాణ సాధించిన పార్టీగా.. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. బీజేపీ వ్యూహాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ బీజేపీపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో.. కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా తగ్గేదే లే అంటున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడంతో పాటు కొన్నిచోట్ల బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. బీజేపీని ఓ కంట కనిపెట్టాలని ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ క్యాడర్ కు ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తోంద. తెలంగాణలో టీఆర్ఎస్ పట్టు సడలకుండా.. బీజేపీ బలపడకుండా ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు గులాబీ నేతలు.
రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయన వ్యూహాలను తట్టుకోలేక రాజకీయ ప్రత్యర్థులు బోల్తా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ను డైలమాలో పడేసేలా ప్రధాని నరేంద్రమోడీ వ్యవహరించారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు సాగుతోంది. ఈ రాజకీయ పోరులో రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ.. బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తారని అంతా భావించారు. టీఆర్ఎస్ కూడా ఇదే ఊహించింది. కానీ ప్రధాని మోడీ వారి అంచనాలకు భిన్నంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా టీఆర్ఎస్, కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు ప్రధాని మోడీ. ఎర్రకోట ప్రసంగలో కూడా వారసత్వం, కుటుంబ రాజకీయాల్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే మిగతా బీజేపీ అగ్రనేతలు మాత్రం కేసీఆర్ ను గట్టిగా టార్గెట్ చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ భిన్నమైన వ్యూహాలు అనుసరిస్తోంది. తెలంగాణలో కూడా స్పెషల్ ప్లాన్ అమలు చేస్తోంది. ఇక్కడ ప్రజలకు ఉన్న సమస్యలు, కేసీఆర్ నెరవేర్చని హామీలు హైలైట్ అయ్యేలా అగ్రనేతలు ప్రసంగాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో కూడా ఎక్కువగా వీటినే ప్రస్తావిస్తున్నారు. మోడీపై కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇస్తూనే.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీజేపీ.
రెండు ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలు చూశాక.. తెలంగాణలో అధికారంపై బీజేపీకి నమ్మకం పెరిగింది. అందుకు తగ్గట్టగా రెగ్యులర్ గా అగ్రనేతలు ఇక్కడ పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రులు వచ్చి.. శాఖల వారీగా కేంద్రం ఇస్తున్న నిధులు, తెలంగాణ వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బలం పెంచుకోవడానికి సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది బీజేపీ. ఏకంగా వంద నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు తీసింది. అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రజ్లలోనే ఉండి వీలైనంత ఎక్కువ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోంది.
బూత్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు బీజేపీ నేతలంతా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తరుణ్ చుగ్ కు తోడుగా మరో ఇంఛార్జ్ ను తీసుకురావడం కూడా వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది.. మిస్సవ్వద్దని మోడీ, అమిత్ షా రాష్ట్ర నేతలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దీంతో శక్తికేంద్రాలు, బూత్ ఇంఛార్జులు యాక్టివ్ అయిన పరిస్థితి. కేవలం పార్టీ బలం పెరిగితే సరిపోదు.. ప్రత్యర్థుల్ని మైండ్ గేమ్ తో దెబ్బతీయాలనే ఉద్దేశం కాషాయ పార్టీకి ఉంది. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్టుగా ఉంది వ్యవహారం.
ఉన్న ఓటు బ్యాంకు నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. ఓట్లు గణనీయంగా పెంచుకోవాలని కాషాయ పార్టీ వ్యహాలు రచిస్తోంది.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రతీ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడింది అధిష్టానం. ఇందుకోసం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి నెలా చేరికలు ఉండాలి..టీఆర్‌ఎస్ ఊహించని విధంగా షాక్‌లు ఇవ్వాలి.. ఇదే బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. అందుకోసం ఢిల్లీలో వ్యూహాలు రచిస్తోంది కాషాయ దళం. చేరికలపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు రాష్ట్ర నేతలు. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ అందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయడం వంటి వ్యూహాలకు పదును పెట్టింది. బలమైన నేతల్ని, పార్టీలో చేరాలనుకునే వారిని ఆకర్షిస్తోంది.
రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి వ్యూహాలు తప్పనిసరి. పదునైన వ్యూహాలు పన్ని..ప్రత్యర్ధులని చిత్తు చేయాలి..అప్పుడే రాజకీయంగా విజయాలు అందుతాయి..ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కూడా ఇదే రకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో కమలదళం పనిచేస్తుంది. కేంద్రంలోని పెద్దల సలహాలతో రాష్ట్రంలో బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
ఇప్పటికే బీజేపీ నేతల యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది..ఎక్కడకక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఎప్పుడు ఒకే రకమైన వ్యూహంతో మాత్రం బీజేపీ పనిచేయడం లేదు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కమలదళం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇక నుంచి మరింత దూకుడుగా వెళ్ళేలా కమలం నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ లో కూడా హ్యాట్రిక్ గెలుపు ఖాయమనే ధీమా కనిపిస్తోంది. కేసీఆర్ మార్క్ వ్యూహాలు, ఎనిమిదేళ్ల పాలన విజయతీరాలకు చేరుస్తాయనే నమ్మకంతో ఉంది ఆ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ ఎంత హడావుడి చేసినా.. ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా ఉంటాయంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఏదేమైనా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో రసవత్తర పోరైతే ఖాయంగా కనిపిస్తోంది. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది. కొత్తగా సర్వేల రాజకీయం షురూ అయింది. ప్రతి పార్టీకి అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు.. ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే ఫలితాలు వండివారుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికైతే ప్రజల నాడి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ఏడాదిలో జరిగే పరిణామాలు ఓటర్లపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంకావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు తీవ్రంగా ఉండటమే. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతుండటంతో.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది.
తెలంగాణలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం అందుకోకుండా చేయడం కోసం బీజేపీ కూడా అదే స్థాయిలో వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఎవరి వ్యూహాలను వాళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయంగా బలపడుతున్న బీజేపీ.. కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు గతంలో ఆయన అమలు చేసిన ప్లాన్‌నే అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
ఒకప్పుడు రాజకీయాలపై పూర్తిగా టీఆర్ఎస్ ఆధిపత్యం ఉండేలా చేసేందుకు ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేసేవారు. ఉప ఎన్నికలు ఏ రకంగా వచ్చినా.. వాటిని టీఆర్ఎస్‌కు అనుకూలంగా మలుచుకుని పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవడం కేసీఆర్ బాగా అలవాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు కూడా టీఆర్ఎస్, కేసీఆర్‌కు చాలావరకు కలిసొచ్చాయి. అయితే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం సీన్ మారుతూ వచ్చింది.
ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో.. ఆ తరువాత హుజూరాబాద్‌లోనూ ఆ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణపై బీజేపీ పట్టు పెరిగేందుకు అవకాశం కలిగింది. మరోవైపు తెలంగాణలో బలపడేందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన ఉప ఎన్నికల వ్యూహాన్నే బీజేపీ కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ తరపున మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ వ్యూహాన్ని బీజేపీ ఆయనపైనే ప్రయోగించనుందని కొందరు చర్చించుకుంటున్నారు. త్వరలో 12 ఉపఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉండకుండా.. ముఖాముఖికి రంగం సిద్ధం చేస్తున్నాయి టీఆర్ఎస్, బీజేపీ. అందుకే రెండు పార్టీలు పరస్పర విమర్శలతో కాంగ్రెస్ ని సైడ్ చేస్తున్నాయి. యుద్ధమైనా, ఆటైనా సమఉజ్జీల మధ్య జరిగితే ఆ మజానే వేరు. ఎవరు గెలిచినా.. ప్రాసెస్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదైనా.. టీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలు మాత్రం రాజకీయ వర్గాల్ని ఆకర్షిస్తున్నాయి. అగ్రనేతల వ్యూహాలు మరింతగా పదునెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాల్సి ఉంది.
టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు బలాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. ప్రజల్లో ఎందుకు అసంతృప్తి ఉందనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. అటు బీజేపీ దూకుడు పెరిగినా.. ఇంకా క్షేత్రస్థాయిలో బలం పెరగడం లేదనే అసంతృప్తి ఉంది. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే కేసీఆర్ విమర్శలకు బీజేపీ డైరక్ట్ కౌంటర్లు ఇవ్వలేకపోతోంది. అవినీతి ఆరోపణలతో నెట్టుకురావడమే కానీ.. నేరుగా తెలంగాణకు ఇది చేశాం అని చెప్పే పరిస్థితి లేదు. కొన్ని ఇబ్బందులున్నా.. సానకూల అంశాలతో సత్తా చాటుతామని రెండు పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలూ తెలంగాణ వేదికగా దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పేరుకి తెలంగాణలో అధికారం లక్ష్యమని చెబుతున్నా.. జాతీయ స్థాయిలో కీలక పాత్ర కోసం టీఆర్ఎస్, దక్షిణాదిలో విస్తరణకు బీజేపీ తెలంగాణను ప్రయోగశాలగా చూస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం ఉంది. అందుకే అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
మరోసారి అధికారం దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసుకుంటుంటే.. ఈసారి తెలంగాణ టార్గెట్ మిస్ కాకూడదని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. దక్షిణాదిలో తాము పాగా వేయబోయే రెండో రాష్ట్రం తెలంగాణనే కావాలని ఆ పార్టీ హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉంది.గెలుపు గుర్రాలు ఎవరు? ఎవరిని రేసులోపెట్టాలి ఏంటనేది సిఎం కేసీఆర్ కు తెలిసినట్లుగా తెలంగాణలో మిగతా వారికి తెలియదు. అందుకే తాను చేయదల్చుకున్న పనిని పక్కా ప్లాన్ తో చేస్తున్నారంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు అంతే అంటున్న తీరు రాజకీయవర్గాల్లో ఎన్నికల వేడిని రగిలిస్తోంది. బీజేపీ కూడా అభ్యర్తుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలని డిసైడైంది.