Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. మూడు వికెట్లతో సత్తా చాటడంతో జింబాబ్వే 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఓపెనర్లు ఇన్నోసెండ్ కియా(4), మారుమని(8), వెస్లీ మధెవెరె(5)లను చాహర్ పెవిలియన్ చేర్చాడు.
Read Also: Thiru Movie review : తిరు రివ్యూ
అయితే జింబాబ్వే ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత బౌలర్లు పట్టు సడలించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా.. కెప్టెన్ చకబ్వా 35, గరవా 34, ఎవాన్స్ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ ఒక వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ 190 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు ఓపెనర్లతో బరిలోకి దిగింది. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషాన్ వంటి ఓపెనింగ్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు వచ్చి రాహుల్, ఇషాన్ కిషాన్ మిడిలార్డర్‌లో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ త్రిపాఠిని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేసి ఇలానే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదని, రుతురాజ్‌ను సైతం చాలా రోజులుగా తుది జట్టులోకి తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
