తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ యేడాది ప్రారంభంలో ‘మారన్’ మూవీతో ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఆ తర్వాత వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో అతనిది గొప్ప ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాదు. దాంతో దాన్ని చూసిన అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఆ రెండు సినిమాలు ఓటీటీలో వచ్చాయి. సో… లేటెస్ట్ మూవీ ‘తిరు చిత్రాంబలమ్’ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని తెలియగానే ఆనందపడ్డారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయడం, అనిరుధ్ సంగీతాన్ని అందించడంతో వారి అంచనాలు, ఆశలు అంబారాన్ని తాకాయి. ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా ఈ సినిమా ‘తిరు’ పేరుతో తెలుగులోనూ డబ్ అయ్యి… గురువారం జనం ముందుకు వచ్చింది.
తిరు ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నప్పుడే రోడ్ యాక్సిడెంట్ లో అతని తల్లి (రేవతి), చెల్లి చనిపోతారు. తండ్రి (ప్రకాశ్ రాజ్) నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగి, వారు చనిపోయారని తిరు నమ్ముతాడు. దాంతో అప్పటి నుండి తండ్రితో మాట్లాడటం మానేస్తాడు. అతని తాత (భారతీరాజా) పేరునే తిరుకు పెడతారు. సో… ఆ ఇంటిలో తిరు, అతని తండ్రి, తాత ఉంటారు. ఆడమనిషి లేని కారణంగా ఆ ఇంటిలో జీవకళ ఉండదు. తిరు డెలివరీ బోయ్ గా పనిచేస్తే, తండ్రి పోలీస్ ఆఫీసర్. తాతయ్యే వాళ్ళిద్దరికీ వండి పెడుతుంటాడు. అలాంటి తిరుకు ఉన్న ఏకైక స్నేహితురాలు శోభన (నిత్యామీనన్). తనకు సంబంధించిన అన్ని విషయాలను ఆమెతోనే షేర్ చేసుకుంటాడు. ఎప్పుడో ఆరో తరగతిలో తను లవ్ చేసిన అనూష (రాశీఖన్నా) చాలా కాలం తర్వాత ఎదురుపడగానే శోభనకే చెబుతాడు. అయితే… ఇంతకాలం తర్వాత కూడా తనది వన్ సైడ్ లవ్ అనే విషయం తిరుకు త్వరగానే అర్థం అవుతుంది. తాడు బొంగరం లేకుండా జీవితాన్ని గడిపేస్తున్న తిరు ఎలా తన లవ్ విషయంలో రియలైజ్ అయ్యాడు? పంతం కొద్ది తండ్రితో మాట్లాడుకుండా ఉండిపోయిన అతను ఏ పరిస్థితుల్లో తిరిగి ఆ బంధాన్ని కలుపుకున్నాడు? తిరు జీవితంలోకి ఎలాంటి నాటకీయ పరిణామాల మధ్య శోభన అడుగు పెట్టిందన్నదే ఈ చిత్ర కథ.
సినిమా క్లయిమాక్స్ లో తిరు తాతయ్య భారతీరాజా ఓ మాట చెబుతాడు. ‘వీళ్ళిద్దరూ ఒకటి అవుతారని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఈ పిల్లలకే తెలియలేదు. కింద (పోర్షన్)లో ఉండే అమ్మాయి పైకి రావడానికి ఇంత డ్రామానా!?’ అని. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మాటలు నిజమే అనిపిస్తాయి. మన మనసుకు నచ్చిన అమ్మాయిని పక్కనే పెట్టుకుని, ఎక్కడెక్కడో వెతికే వెర్రిబాగుల కుర్రాళ్ళ కథలు ఇప్పటికే బోలెడు వచ్చాయి. ఇదీ ఆ కేటగిరికీ చెందిందే. అందువల్ల సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ మనకు ఏదీ కొత్తగా అనిపించదు. పోనీ పాటలైనా ఆకట్టుకునేలా ఉన్నాయా అంటే అదీ లేదు! సాదా సీదాగా సినిమా అలా సాగిపోతుంది… అంతే!! క్లయిమాక్స్ సైతం పరమ రొటీన్ గా ఉంది. ఈ మాత్రం కథను నడపడానికి ఇంత డ్రామాను క్రియేట్ చేశారా అనిపిస్తుంది. బట్… ఇంత రొటీన్ కథను కూడా కాస్తంత కూర్చోపెట్టేలా చేసింది ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్!
ధనుష్ కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. జీవితంలో దెబ్బ తిన్న మధ్య తరగతి కుర్రాడిగా ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ అందరి కంటే ఎక్కువ మార్కులు మాత్రం నిత్యా మీనన్ కు పడతాయి. చాలా రోజుల తర్వాత ఆమెకు మంచి పాత్ర లభించింది. దాన్ని సమర్థవంతంగా పోషించింది. రాశీఖన్నా, ప్రియ భవానీ శంకర్ పాత్రలు గెస్ట్ రోల్ నే తలపిస్తాయి. వాళ్ళ ఇమేజ్ కు తగ్గ పాత్రలు కావివి. తిరు తండ్రిగా ప్రకాశ్ రాజ్, తాతగా భారతీరాజా చక్కగా నటించారు. కానీ ప్రకాశ్ రాజ్ పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం ఏ మాత్రం బాలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాలనే తొందరలో ఇలా చేసి ఉండొచ్చు! తిరు తల్లిగా రేవతి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఓంప్రకాశ్ కెమెరాపనితనం చెప్పుకోదగ్గది. అనిరుధ్ ట్యూన్స్ కంటే… నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడు మిత్రన్ జవహార్ కు రీమేక్స్ చేయడంలో మంచి అనుభవమే ఉంది. గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఆర్య’, ‘రెడీ’ వంటి సినిమాలను తమిళంలో రీమేక్ చేశాడు. బట్ తనే స్టోరీ రాసుకుని, డైరెక్షన్ చేయాల్సి వచ్చే సరికీ తడబడ్డాడు. పాతికేళ్ళ క్రితం వచ్చిన సినిమాను ఇప్పుడు మరోసారి చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది తప్పితే… కొత్త చిత్రాన్ని చూసిన భావన ‘తిరు’ కలిగించదు.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ధనుష్, నిత్యామీనన్ నటన
అనిరుథ్ నేపథ్య సంగీతం
ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
బోర్ కొట్టించే ద్వితీయార్థం
ట్యాగ్ లైన్: ఎయిటీస్ లవ్ స్టోరీ!