IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..

Yuvi

Yuvi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని జీఎమ్ఆర్ (GMR) గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చెరి రెండు సంవత్సరాల చొప్పున ప్రత్యామ్నాయంగా నడుపుతాయి. 2025, 2026 సీజన్లలో జీఎమ్ఆర్ గ్రూప్ జట్టును నడిపించగా, వచ్చే రెండేళ్ల పాటు (2027, 2028) జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలను స్వీకరించనుంది. గతంలో జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కీలక పాత్ర పోషించారు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 (SA20) లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించి, ఆ జట్టును ఫైనల్‌కు చేర్చిన అనుభవం కూడా గంగూలీకి ఉంది. అందుకే ఆయన తిరిగి ఢిల్లీ జట్టులోకి వస్తూ, యువరాజ్ సింగ్‌ను కూడా తనతో పాటు డగౌట్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

×
×
Ad

గత రెండు సీజన్లలో (IPL 2025, 2026) ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. అక్షర్ పటేల్ సారథ్యంలో.. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. 2025లో టోర్నీని అద్భుతంగా ఆరంభించినా, రెండో భాగంలో తడబడి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 2026లో మరింత నిలకడలేని ప్రదర్శనతో ఆరో స్థానానికి పడిపోయింది. ఈ పేలవ ఫలితాల వల్ల ప్రస్తుత ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ పదవి ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో, 2027లో గంగూలీ మళ్లీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, యువరాజ్ సింగ్ రాకతో జట్టుకు సరికొత్త ఊపు వస్తుందని యాజమాన్యం ఆశిస్తోంది. సీనియర్ అధికారులు కూడా యువరాజ్ చేరికను ధృవీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.