Site icon NTV Telugu

World Cup 2023 Schedule: ఇంకా విడుదల కాని 2023 ప్రపంచకప్ షెడ్యూల్.. అసలు కారణం పాకిస్తాన్!

World Cup 2023 Schedule

World Cup 2023 Schedule

Why Delay in ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్‌ చేసింది. ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉంది. జూన్ తొలి వారంలో షెడ్యూల్‌ను ప్రకటిస్తారనుకున్నా.. అది జరగలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు సహా అభిమానులు కూడా షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఆలస్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కారణమని తెలుస్తోంది.

ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ఏడాది ముందే ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఇది ఐసీసీకి ఓ ఆనవాయితీ. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా ఏడాది ముందుగానే విడుదల చేసింది. ఇపుడు మాత్రం కేవలం 120 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంకా రిలీజ్ కాలేదు. బీసీసీఐ పంపిన డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని బోర్డులకు పంపగా.. పీసీబీ అభ్యంతరాలు చెబుతోందని తెలుస్తోంది. భారత్‌లో ప్రపంచకప్ కాబట్టి ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపామని, భద్రతా కారణాల దృష్ట్యా పాక్ గవర్నమెంట్ అనుమతి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని పీసీబీ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.

అంతేకాదు డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను మార్చాలని ఐసీసీని పీసీబీ కోరిందని సమాచారం. చెన్నైలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ వేదిక, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ బెంగళూరులో కాకుండా చెన్నైలో నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. అఫ్గానిస్థాన్‌తో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహించాలని కోరుతోందని తెలుస్తోంది. టీమిండియాతో జరిగే అహ్మదాబాద్ మ్యాచ్ కూడా మార్చాలని పీసీబీ పట్టుబడుతోంది. ఈ అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించిందట. అందుకే ప్రపంచకప్ షెడ్యూల్‌ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సమస్యను ఐసీసీ త్వరలోనే పరిష్కరించి షెడ్యూల్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆసియా కప్‌ 2023తో పీసీబీ, బీసీసీఐ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.

Also Read: Portable Air Conditioner Price: ధర 2 వేలు.. 90 శాతం విద్యుత్ ఆదా! ఏసీ మాదిరి కూలింగ్

Exit mobile version