టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ.
ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ స్టాంప్ చిర ఎప్పటికీ ఉండిపోతుంది.
క్రికెట్‌లోకి ఎన్ని ఫార్మాట్లు వచ్చినా ఎవర్‌గ్రీన్ ఫార్మాట్ టెస్టులే. జట్టు ప్రతిభకు..ఆటగాడి టాలెంట్‌కు ఇప్పటికీ టెస్టులే కొలమానం. ఈ లాంగ్ ఫార్మాట్‌లో చాలా కాలం మనం అర కొర విజయాలతో సరిపెట్టుకున్నాం. ఐతే, గంగూలీ, ధోనీ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఓటములను అధిగమించి విజయాల బాట పట్టింది. ఆ ఇద్దరికి నిజమైన వారసుడు కోహ్లీ. వారికి కూడా సాధ్యం కాని ఎత్తులకు భారత క్రికెట్‌ని తీసుకు వెళ్లిన ఘనత ఆయనకే చెందుతుంది. ప్రంపంచంలోనే అత్యంత విజయవంతమైన నాయకులలో ఆయన ఒకరు. గ్రేమ్ స్మిత్, స్టీవ్‌వా,రికీ పాంటింగ్ మాత్రమే కోహ్లీ కన్నా ముందున్నారు. ఆయన భారత క్రికెట్‌కు ఎంత చేశాడో దీనిని బట్టి అర్థమవుతుంది.
కోహ్లీ కెప్టెన్ అయ్యే నాటికి విదేశాల్లో భారత్ గెలుపు ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యం. కానీ, ఇప్పుడు ఓడిపోతే ఆశ్చర్యం. టెస్టుల్లోనే కాదు అన్ని ఫార్మట్లలో ఆయన సారధ్యంలో టీమిండియా అద్భుతాలు చేసింది. ఆటగాడిగా, సారథిగా జట్టు కోసం కోహ్లీ వందశాతం కృషి చేశాడన్న సచిన్ మాటలు నూటికి నూరుపాళ్లు నిజం.
ఎన్ని విజయాలు సాధించినా ప్రతి ఆటగాడికి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. కొంత కాలంగా కోహ్లీ ఫామ్‌లో లేడు. అంతర్జతీయ సెంచరీ సాధించి చాలా కాలం అవుతోంది. ఐతే, సారధిగా సక్సెస్ అవుతున్నందున ఆ విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు విదేశీ గడ్డపై పరాజయాన్ని బీసీసీఐ తేలిగ్గా తీసుకోలేదు. మరో సారి ఉద్వాసనకు గురి కాకుండా కోహ్లీ ముందుగానే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడనిపిస్తోంది. బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే మాట అంటున్నారు.
కోహ్లీ భయానికి కారణం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. కోహ్లీ స్టార్ ఆటగాడు కావటంతో బోర్డు నిర్ణయం కొంత వివాదాస్స్సపదమైంది. ఇప్పుడూ అది రిపీట్ అయ్యే అవకాశమే ఎక్కువ. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటాడు.
విదేశీ సిరీస్‌ల పరాజయాలను బోర్డు మాత్రమే కాదు క్రికెట్ పెద్దలూ చాలా సీరియస్‌గా తీసుకుంటారు. విమర్శల వెల్లువెత్తుతాయి. కెప్టెన్ ఉద్వాసనకు గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రమాదం ఇంకా ఎక్కువ.
1-0 ఆధిక్యంలో ఉన్న స్థితిలో టీమిండియా ఈజీగా గెలవాల్సిన సిరీస్‌ని ..కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. చేజేతులా ఓటమిపాలైంది. ఈ పరాజయాన్ని క్రికెట్ బోర్డు తేలిగ్గా తీసుకుంటుందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు. కోహ్లీ ముందు రాజీనామా మినహా వేరే మార్గం లేదు.
ఇండియన్ క్రికెట్‌కు మరపురాని విజయాలు అందించిన కోహ్లీ వారసునికి ముందు ముందు పెద్ద పరీక్షా కాలం అని చెప్పాలి. సారధ్య బాధ్యతలు ఎవరు తీసుకున్నా కోహ్లీతో పోలిక అనివార్యం. ప్రారంభ సిరీస్‌లలోఅతనిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. మార్చిలో శ్రీలంక ఇండియా పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది. తరువాత సెప్టెంబర్ లో ఆస్ర్టేలియా భారత పర్యటనకు వస్తుంది. నాలుగు టెస్టులు ఆడుతుంది. కోహ్లీ వారసునుకి ఈ సిరీస్ అసలు సిసలు పరీక్ష అవుతుంది.
కోహ్లీ వారసుడి ఎంపికకు బీసీసీఐకి పెద్ద కసరత్తు తప్పేలా లేదు. ఐదుగురు ఆటగాళ్లు జట్టు పగ్గాలు అందుకునేందుకు రెడీగా ఉన్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ రేస్‌లో ఉన్నారని చెప్పొచ్చు.
డ్యాషింగ్ రోహిత్ శర్మ ఇప్పటికే వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టెస్ట్ టీమ్‌కు వైఎస్ కెప్టెన్ కూడా ఆయనే. సహజంగానే ఆయనకు అవకాశాలు ఎక్కువ. రోహిత్ ట్రాక్ రికార్డు కూడా అందుకు అనుకూలిస్తుంది. గాయం బారిన పడకపోయి ఉంటే సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ఆయన కెప్టెన్ వ్యవహరించేవాడు. ఐతే, ఈ రేస్‌లో వయస్సు ఆయనకు అవరోధంగా మారొచ్చు. ఇప్పటికే ఆయనకు 34 ఏళ్లు.
ధోనీ నుంచి సారధ్య బాధ్యతలు స్వీకరించే నాటికి కోహ్లీకి వయస్సు ఇరవై ఆరేళ్లు. తక్కువ వయస్సును బోర్డు పరిగణలోకి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ రేస్‌లో ముందుకొస్తారు. ఐతే, రాహుల్‌తో పోలిస్తే రిషబ్‌కే ఛాన్స్ ఎక్కువ. కానీ, రాహుల్ కొంత కెప్టెన్సీ అనుభవం ఉంది.
మరోవైపు, 24 ఏళ్ల రిషభ్ పంత్ మాజీ కెప్టెన్ ధోనిని తలపిస్తున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 28 టెస్టుల్లో 1735 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు రాహుల్ కన్నా ఎక్కువ. కీపర్‌గా ఇప్పటి వరకు 102 క్యాచ్‌లు పట్టాడు. రిషభ్ గణాంకాలకు, ధోనీ గణాంకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే అతని స్టయిల్..డ్యాషింగ్ బ్యాటింగ్ కోహ్లీకి దగ్గరగా ఉంటుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెలెక్టర్లకు పంత్ యువ ప్రత్యామ్నాయం.
ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 27 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. విదేశీ గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి 28 ఏళ్ల బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు.
కెప్టెన్ రేసులో టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉంటారు. 35 ఏళ్ల ఈ స్పిన్ మాంత్రికుడు 84 టెస్టులు ఆడిన మహా అనుభవజ్ఞుడు. అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం భారత జట్టు సారధ్య పగ్గాలు అశ్విన్ చేతికి అందినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.