Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్‌స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్‌?.. అంత తోపు ప్లేయరా?

Who Is Saransh Jain

Who Is Saransh Jain

Who Is Saransh Jain: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు ప్రకటించింది. టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌ కాగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ సంచలనం సాయి సుదర్శన్‌లకు జట్టులో చోటు దక్కినా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు.

సుందర్‌ స్థానంలో సరాంశ్:

తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ మొదటి టెస్టుకు అందుబాటులో లేడు. అతడు రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టులో ఏకైక ఆఫ్‌స్పిన్నర్‌గా సుందర్ ఉన్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని దేశవాళీ మాన్‌స్టర్ సరాంశ్ జైన్‌తో సెలెక్టర్లు భర్తీ చేశారు. ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అతనికి ఎట్టకేలకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. దాంతో ఎవరీ సరాంశ్ జైన్‌ అని అభిమానులు తెగ వెతుకున్నారు. ప్రస్తతం సరాంశ్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

దేశవాళీ క్రికెట్‌లో విశేష అనుభవం:

మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ సరాంశ్ జైన్. 33 ఏళ్ల సరాంశ్‌కు భారత సీనియర్ జట్టులో అవకాశం దక్కడం ఇదే మొదటిసారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సరాంశ్‌ దేశవాళీ క్రికెట్‌లో విశేష అనుభవం కలిగి ఉన్న ప్లేయర్. ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 31.75 సగటుతో 2000కు పైగా పరుగులు చేయడంతో పాటు 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 47 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 553 రన్స్, 38 వికెట్స్.. 21 టీ20లో 37 రన్స్, 18 వికెట్స్ పడగొట్టాడు.

ఇండియా-ఏ తరఫున అద్భుత ప్రదర్శన:

2021 రంజీ ట్రోఫీలో ముంబైని ఓడించి మధ్యప్రదేశ్ చారిత్రక టైటిల్ గెలుచుకున్న జట్టులో సరాంశ్‌ జైన్ కీలక సభ్యుడు. ఆ టోర్నీలో అతని ప్రదర్శన జట్టు విజయానికి బాటలు వేసింది. ఇటీవల శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున ఆడిన సరాంశ్‌ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రెండో మ్యాచ్‌లో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా వచ్చిన ఈ అవకాశం అతని కెరీర్‌లో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. శ్రీలంకతో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కితే.. 2021లో బ్రిస్బేన్‌లో వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేసిన తర్వాత భారత తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే తొలి ఆఫ్‌ స్పిన్నర్‌గా సరాంశ్‌ నిలుస్తాడు.

భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాంశ్ జైన్.