Site icon NTV Telugu

IND Vs WI: రెండో టీ20లో వెస్టిండీస్ విజయం.. 1-1తో సిరీస్ సమం

West Indies

West Indies

IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. రిషబ్ పంత్ (24) కొన్ని మెరుపులకే పరిమితం అయ్యాడు. ఈ దశలో హార్డిక్ పాండ్యా (31 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఒక సిక్సర్‌తో 27) రాణించారు. అయితే స్వల్ప తేడాతో వీరిద్దరూ అవుటయ్యారు. అనంతరం వచ్చిన దినేష్ కార్తీక్ (7), అశ్విన్ (10) కూడా క్రీజులో ఉండలేక పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 4 ఓవర్లు వేసి ఒక మెయిడెన్ సహా 6 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బతీశాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు.

139 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రెండన్ కింగ్ శుభారంభం అందించాడు. అతడు 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మెయిర్ (6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. అయితే చివర్లో థామస్ 19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరం అయ్యాయి. 18వ ఓవర్ వేసిన పాండ్యా 11 పరుగులిచ్చాడు. 19వ ఓవర్ వేసిన అర్షదీప్ పావెల్‌ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి.

Read Also: యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బంతిని అందుకున్న అవేష్ ఖాన్ తొలి బంతినే నోబాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. అంతకుముందు రెండో టీ20 మ్యాచ్ లగేజీ ఆలస్యంగా గ్రౌండ్‌కు చేరుకున్న కారణంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

Exit mobile version