Site icon NTV Telugu

Wasim Jaffer: టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ రంజీలు ఆడాల్సిందే..!!

Wasim Jaffer

Wasim Jaffer

Wasim Jaffer: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడో వన్డే నుంచి కీలక ఆటగాళ్లను తప్పించాలని బీసీసీఐకి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక సూచనలు చేశాడు. మూడో వన్డే నుంచి కోహ్లీ తప్పుకుని రంజీ ట్రోఫీ ఆడాలంటూ ఇప్పటికే రవిశాస్త్రి సహా పలువురు మాజీలు సూచించారు. అయితే కోహ్లీ మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, సిరాజ్, షమీ కూడా ఇదే పని చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో గెలిచినా.. గెలవకపోయినా సమస్య లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం సన్నాహకాలు మెుదలుపెట్టాలని జాఫర్ అన్నాడు.

Read Also: Akshay Kumar: ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ…

అటు భారత స్టార్ ఆటగాళ్లు టెస్టు మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైందని.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ బంగ్లాదేశ్‌‌తో టెస్ట్ సిరీస్ ఆడినా అంతగా రాణించలేదని జాఫర్ చెప్పాడు. రోహిత్ శర్మ గతేడాది మార్చిలో టెస్టు ఆడాడని.. ఆ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేదన్నాడు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే మెుదటి టెస్టుకు సిద్ధంగా ఉండాలని జాఫర్ సూచించాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మంగళవారం మొదలవుతుందని.. భారత జట్టు కివీస్‌తో మూడో వన్డే కూడా అదే రోజు ఆడాల్సి ఉందన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్‌కు చాలా కీలకమని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ ఈ సిరీస్ గెలిచి తీరాలని జాఫర్ అన్నాడు. అంతేకాదు టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవాలన్నా కూడా టీమిండియాకు ఈ సిరీస్ కీలకమేనని తెలిపాడు.

Exit mobile version