NTV Telugu Site icon

బీసీసీఐ-కోహ్లీ మధ్య ముదురుతున్న వివాదం…

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. విరాట్‌ కోహ్లీ మధ్య గొడవ.. దేశ క్రికెట్‌కు మంచిది కాదని సూచిస్తున్నారు సీనియర్లు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు…ఇలా గొడవ పడితే…దీని ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు గొడవలు జరిగితే…ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందన్నారు మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ఎంత గొప్పదో.. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్ప విషయమన్నారు. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం.. మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

ఈ వ్యవహారంపై లెజెండరీ బ్యాట్స్‌మెన్‌ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నోరు విప్పాలని అన్నారాయన. అప్పుడే వివాదంపై స్పష్టత వస్తుందన్నారు. తనకు తెలిసి కోహ్లీ వ్యాఖ్యల్లో బీసీసీఐ ప్రస్తావన లేదన్న గవాస్కర్‌.. కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారన్న మెసేజ్ ఇచ్చిన వారినే ఆ విషయం గురించి అడగాలని సూచించారు.

కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడే.. వద్దని తాము వారించామన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అయితే దీన్ని కోహ్లీ ఖండించాడు. కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పగానే బీసీసీఐ నుంచి వ్యతిరేకత రాలేదని.. ఎవరూ వద్దని చెప్పలేదని బాంబు పేల్చాడు. దీంతో కోహ్లీ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ ఎపిసోడ్‌లో కొందరు ఆటగాళ్లు కోహ్లీకి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.