Site icon NTV Telugu

Virat Kohli: నేను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మను.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli Preparation Technique

Virat Kohli Preparation Technique

ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి మదిలోనే విజువలైజ్‌ చేసుకుంటా అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా అని, మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతా అని చెప్పాడు. కఠిన సాధన చేస్తేనే మంచి ఫలితం వస్తుందనే దానిని తాను నమ్మనని, మానసికంగా ముందే సిద్ధమవుతా అని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి సమస్య లేదని, మానసికంగా దృఢంగా ఉంటే అద్భుతంగా ఆడవచ్చు అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆదివారం రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే విరాట్ సెంచరీ (135) చెలరేగాడు.

రాంచి వన్డేలో అద్భుతమైన శతకం చేసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మనని, తన సన్నద్ధత మానసికమైనదని వివరించాడు. ‘నా కెరీర్‌లో 300కి పైగా వన్డేలు ఆడాను. బంతితో ఎప్పుడూ నేను టచ్‌లోనే ఉన్నా. ప్రాక్టీస్ సమయంలో హిట్టింగ్‌ చేయడంపై దృష్టి పెడతా. నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే.. ఆ ప్రభావం మ్యాచ్‌లో ఆట తీరుపై పడుతుంది. ఆడుతూ ఉంటే ఫామ్‌లోకి రావడం కష్టమేమీ కాదు. నేను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా. మానసికంగా సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతాను. రాంచీలోనూ అదే చేశా’ అని విరాట్ తెలిపాడు.

Also Read: Virat Kohli Test Comeback: టెస్టుల్లోకి పునరాగమనం.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

‘నాకు ఇపుడు 37 ఏళ్లు. ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి నా మనసులో విజువలైజ్‌ చేసుకుంటా. ఆ విజువలైజ్‌లోకి బౌలర్లు, ఫీల్డర్లు వస్తారు. రాంచి పిచ్ తొలి 25 ఓవర్లలో ఓ రకంగా, ఆ తర్వాత మరొకలా మారింది. అందుకే బంతి కోసం వేచి చూసి ఆడాలనుకున్నా. పిచ్ పరిస్థితులకు తగినట్టు నా ఆటను మార్చుకున్నా. కఠిన సాధన చేస్తేనే ఇలా వస్తుందనే దానిని నేను అస్సలు నమ్మను. ప్రతి మ్యాచ్‌కు ముందు మానసికంగా సిద్ధమవుతా. ఫిట్‌నెస్‌ విషయంలో నాకు ఏ సమస్య లేదు. మానసికంగా దృఢంగా ఉంటే బాగా ఆడొచ్చు’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

 

Exit mobile version