Virat Kohli Reacts On His Form: తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. తన ఆట ఎలా ఉందో తనకు తెలుసని, సామర్థ్యం ఉంటేనే ఇక్కడిదాకా రాగలము కదా అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు. ‘నా ఆట ఎలా ఉందో నాకు తెలుసు. అయినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో వైవిధ్యమైన బంతులతో ఇబ్బంది పెట్టే బౌలర్లు ఎంతోమంది ఉంటారు. అలాగే.. ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. అవన్నీ ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే కదా.. ఇక్కడిదాకా రాగలము. ప్రస్తుత గడ్డు దశను నేను సులువుగానే దాటగలను’ అని కోహ్లీ అన్నాడు.
ఇదే సమయంలో 2014 నాటి ఇంగ్లండ్ పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. ‘ఇంగ్లండ్ టూర్‌లో జరిగిన తప్పిదాలేంటో నేను తెలుసుకున్నాను. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని.. దానిని సరిదిద్దుకున్నాను. నిజానికి.. ఇప్పుడు కూడా నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నా. ఒక్కసారి తిరిగి రిథమ్‌లోకి వస్తే.. ఇంకా మెరుగ్గా రాణించగలను. కాబట్టి నాకిది అసలు సమస్యే కాదు. ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఎత్తుపళ్లాలు అనేవి ఉంటాయి. ఓ ఆటగాడిగా, వ్యక్తిగా నేనూ అందుకు అతీతం కాదు. అయితే, ఈ గడ్డు పరిస్థితి నన్ను ఏమాత్రం భయపెట్టలేదు. నా అనుభవాలు ఎంతో విలువైనవి. అవి నాకు ఎన్నో నేర్పించాయి, ఇంకా నేర్పిస్తున్నాయి కూడా! కచ్చితంగా ఈ దశను నేను సులువుగా అధిగమిస్తా’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
కాగా.. చాలాకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న సంగతి తెలిసిందే! అతడు సెంచరీ చేసి వెయ్యి రోజుల పైనే అవుతోంది. అయితే.. ఆసియా కప్‌లో మాత్రం కోహ్లీ అదరగొడతాడని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా.. ఆగస్టు 28వ తేదీన పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో తప్పకుండా చెలరేగిపోతాడని భావిస్తున్నారు. మరి.. అభిమానుల అంచనాలకి తగ్గట్టు కోహ్లీ తిరిగి ఫామ్‌లో వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.