డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన పరిణామం ఇది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. దాంతో 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) ఫాలోవర్స్ అయోమయంలో పడిపోయారు. శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచే కింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్ పూర్తిగా మాయమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Virat Kohli’ అని సెర్చ్ చేస్తే.. ప్రొఫైల్ కనిపించడం లేదు. ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’, ‘ది లింక్ మే బీ బ్రోకెన్’ అనే మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. అంతేకాదు విరాట్ సోదరుడు వికాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా సెర్చ్‌లో కనిపించడం లేదు.
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అకౌంట్ డీయాక్టివేట్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోలో ఏదైనా భారీ సాంకేతిక లోపం తలెత్తిందా? లేదా విరాట్ కోహ్లీ అకౌంట్ హ్యాకింగ్ అయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీకి చెందిన ‘ఎక్స్’ అకౌంట్ మాత్రం యాక్టివ్‌లోనే ఉంది. అయినప్పటికీ ఈ వ్యవహారంపై కింగ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దాంతో నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు అభిమాను పోస్టులు పెడుతున్నారు. ‘విరాట్ అకౌంట్ ఎక్కడికి పోయింది?’, ‘భాభీ ఏదైనా చెప్పండి’ అంటూ కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ఒక రకంగా అనుష్క అకౌంట్ హెల్ప్‌డెస్క్‌లా మారిపోయింది. వేలాది ప్రశ్నలు వచ్చినప్పటికీ అనుష్క ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read: WPL 2026 Final: గ్రేస్ ఆల్‌రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఆర్సీబీ!
ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ దంపతులు కుటుంబ జీవితం, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఈ అంశంపై కూడా వారు మౌనంగా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇది తాత్కాలిక విరామం అని కొందరు ఫాన్స్ అంటుంటే, ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పేశాడేమోనని మరికొందరు భావిస్తున్నారు. విషయం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా కోహ్లీ ఉన్నాడు. ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సి తర్వాత క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్లేయర్ కింగ్ కోహ్లీనే.
