Site icon NTV Telugu

మరో రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Read Also: ఐపీఎల్‌: అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా

సచిన్ దక్షిణాఫ్రికాలో 57 వన్డేలు ఆడగా 2,001 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 29 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 1,313 పరుగులు చేసి రెండో స్థానంలో, 36 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ 1,309 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ దక్షిణాఫ్రికా గడ్డపై ఆడిన వన్డేల్లో 1,287 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే గంగూలీ రికార్డును, 22 పరుగులు చేస్తే ద్రవిడ్ రికార్డును అధిగమిస్తాడు. ఈ టూర్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి సాధ్యపడకపోవచ్చు. మరోవైపు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. అతడు సెంచరీ చేసి రెండేళ్లు దాటి పోయింది. చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ బాదాడు. మరి కోహ్లీ తన సెంచరీల దాహాన్ని ఈ సిరీస్ ద్వారా తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

Exit mobile version