Site icon NTV Telugu

Virat Kohli: అప్పుడు నేను తొండి ఆట ఆడాను.. అవుటైనా బ్యాటింగ్ చేశాను..!!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్‌లో 50 మిలియన్‌ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్‌లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన చిన్ననాటి సంగతుల గురించి అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిన్నప్పుడు వాడిన కొన్ని క్రికెట్ పదాల గురించి కోహ్లీ తన వీడియోలో వివరించాడు.

Read Also: Ozone Depletion: ఓజోన్ లేయర్‌ను దెబ్బతీస్తున్న అయోడిన్.. పరిశోధనలో వెల్లడి.

చిన్నతనంలో గల్లీ క్రికెట్ ఆడుతూ బేబీ ఓవర్ అని పిలిచేవాళ్లమని.. ఎందుకంటే ఆ ఓవర్‌లో మూడు బంతులు మాత్రమే ఉండేవని కోహ్లీ తన వీడియోలో వివరించాడు. అంతేకాకుండా ట్రయల్‌ బాల్‌ కూడా బాగా వాడేవాళ్లమని తెలిపాడు. ఎవరైనా బ్యాటర్‌ తొలి బంతికే ఔటైనప్పుడు దానిని ట్రయల్‌ బాల్‌గా పిలిచేవాళ్లమని.. తాను చాలాసార్లు బేబీ ఓవర్లు, ట్రయల్‌ బాల్స్‌ ఆడినట్లు కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. గల్లీ క్రికెట్ ఆడే సమయంలో తాను తొండి ఆట ఆడేవాడినని.. తాను అవుటైతే ట్రయల్ బాల్ అంటూ రచ్చ చేసి మళ్లీ బ్యాటింగ్ చేసేవాడినని కోహ్లీ వివరించాడు. అయితే ఇప్పుడు గల్లీ క్రికెట్‌లో బేబీ ఓవర్ అన్న పదం వినిపించడం లేదన్నాడు. మరోవైపు బట్టా అనే పదం కూడా తాము వాడేవాళ్లమన్నాడు. బట్టా అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతుంటారని.. బంతిని విసరడం కోసం ఆ పదాన్ని పలుకుతారని చెప్పాడు. టెన్నిస్‌ బాల్‌ను కాస్త కఠినంగా విసిరితే బట్టా సంధించాడని అరిచేవాళ్లమని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ పదాన్ని అప్పట్లో కొన్ని ప్రాంతాలలోనే వాడేవాళ్లు. మన తెలుగు రాష్ట్రాలలో బట్టా అనే పదం దాదాపుగా చాలా మందికి తెలియదు.

https://twitter.com/imVkohli/status/1570295580110491650

Exit mobile version