NTV Telugu Site icon

IND vs AFG: ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్‌లో భువి అదుర్స్

India Defeat Afghanistan

India Defeat Afghanistan

IND vs AFG: ఆసియా కప్‌ సూపర్‌ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన అప్ఘాన్ సేన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన తన అద్భుత సెంచరీతో భారత్ భారీ స్కోరును సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్‌ కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లీ తన టీ-20 కెరీర్‌లో అత్యధిక పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కేఎల్‌ రాహుల్ కూడా 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ 13వ ఓవర్‌లో రాహుల్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వెంటనే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కోహ్లీతో పాటు భారత్ అధిక స్కోరు సాధించడంలో భాగస్వామ్యమయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 భారీ స్కోరును సాధించింది.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్ఘాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చిందంటే అది ఇబ్రహీం జాద్రాన్ వల్లే. జాద్రాన్ 59 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముజీబ్ 18, రషీద్ ఖాన్ 15 పరుగులు చేశారు. టీమిండియా బౌలింగ్‌లో హైలైట్ అంటే భువీ నిప్పులు చెరిగే స్పెల్ అని చెప్పాలి. ఈ రైట్ హ్యాండ్ పేస్ బౌలర్ 4 ఓవర్లు విసిరి కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. భువీ స్పెల్‌లో ఓ మెయిడెన్ కూడా ఉంది. ఇక, అర్షదీప్ 1, దీపక్ హుడా 1, అశ్విన్ 1 వికెట్ తీశారు.

Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. విరాట్​ కోహ్లీకి టీ20ల్లో ఇదే(122) అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్‌లో 5 శతకాలు బాదిన విరాట్‌కు అంతర్జాతీయ టీ-20ల్లో ఇదే తొలి సెంచరీ. 2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున చేసిన 113 (50 బంతుల్లో) ఇప్పటివరకు విరాట్​ అత్యుత్తమ స్కోరుగా ఉండేది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ టాప్‌లో నిలిచాడు. కోహ్లీ ఇప్పుడు 122 రన్స్​ చేయగా.. రోహిత్​(118), సూర్యకుమార్​ యాదవ్​(117) వరుసగా 2,3 స్థానాల్లో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ-20ల్లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా విరాట్​ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ 3 ఫార్మాట్లలో సెంచరీలు బాదారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 3500 పరుగుల మార్కు దాటిన రెండో క్రికెటర్​ విరాట్​ కోహ్లీ. రోహిత్​ 3,620 పరుగులతో టాప్‌లో ఉండగా.. విరాట్​ 3,584 పరుగులు​ చేశాడు.

Show comments