ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి వేసి మాట్లాడుతుంటే తనకు ఒక కలలా అనిపించిందని వైభవ్ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ పంచుకున్న ఒక వీడియోలో వైభవ్ మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే, విరాట్ భయ్యా నా భుజంపై చేయి వేసినప్పుడు నా గుండె ఆగినంత పనైంది. నేను చిన్నప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి వీరాభిమానిని. అంత పెద్ద స్టార్ నాతో మాట్లాడుతుంటే నమ్మలేకపోయాను. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే, మనకు టీవీల్లో కనిపించే అంత పెద్ద విరాట్ కోహ్లీలా అస్సలు అనిపించలేదు. చాలా సాధారణంగా, ఒక సొంత అన్నయ్యలా మాట్లాడారు” అని తెలిపాడు.
క్రికెట్ భవిష్యత్తుపై కోహ్లీ ఇచ్చిన సలహాలను వైభవ్ గుర్తుచేసుకున్నాడు. “నేను ప్రస్తుతం ఏ విషయాల్లో బాగా ఆడుతున్నానో కోహ్లీ భయ్యా వివరించారు. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా రాణించడానికి ఏం చేయాలి? దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఏ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి? అనే విషయాలపై ఒక అన్నలా నాకు దిశానిర్దేశం చేశారు” అని వైభవ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఆ సమయంలో కోహ్లీ తన క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడని, ఐపీఎల్ టోర్నీలో తన వద్ద ‘ఆరెంజ్ క్యాప్’ లేనప్పుడల్లా విరాట్ ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్యాప్‌నే ఎంతో ఇష్టంగా పెట్టుకునేవాడినని ఈ యువ ఆటగాడు వెల్లడించాడు.
Vaibhav Suryavanshi – I was an RCB fan before, and a hardcore Virat Kohli fan. When he put his hand on my shoulder and spoke to me, it genuinely felt like a dream. The way he was talking, it didn’t even feel like I was speaking to Virat Kohli himself. pic.twitter.com/novZtpVAF6
— Kohlistic🔥 (@Kohlistic18) June 7, 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. 16 మ్యాచ్‌ల్లో 237 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డును కైవసం చేసుకున్నాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ సైతం అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 675 పరుగులు చేసి, ఆర్‌సీబీ జట్టు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ వంటి దిగ్గజం ఇచ్చిన సలహాలు తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడతాయని వైభవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

