Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: తుఫాను ఇన్నింగ్స్.. కట్ చేస్తే విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైభవ్ అవుట్!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్స్‌కు ఉండడం విశేషం. లిస్ట్‌-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్‌ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్‌లో వైభవ్ ఆడడు. విజయ్ హజారే ట్రోఫీలో ప్లేట్ గ్రూప్‌లో బీహార్ జట్టు రెండవ మ్యాచ్ డిసెంబర్ 26న మణిపూర్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు వైభవ్ దూరం కానున్నాడు.

డిసెంబర్ 26న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో వైభవ్ సూర్యవంశీ పాల్గొంటాడు. ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డుకు వైభవ్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతుంది. ఇందుకోసం వైభవ్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లాడు. ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు ప్రదానోత్సవంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము పిల్లలను సత్కరిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్లలందరితో సమావేశమవుతారు.

Also Read: IND vs SL: నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20.. అభిమానులకు ప్రత్యేక సందర్భం!

అవార్డుల ప్రదానోత్సవం తర్వాత వైభవ్ సూర్యవంశీ భారత అండర్-19 జట్టులో చేరనున్నాడు. డిసెంబర్ 30న దక్షిణాఫ్రికాకు భారత జట్టు బయలుదేరుతుంది. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా వైభవ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ జనవరి 4న ప్రారంభం కానుంది, చివరి మ్యాచ్ జనవరి 9న జరగనుంది. ఆ తర్వాత భారత్ అండర్-19 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ ప్రపంచకప్‌నకు వైభవ్‌ ఎంపిక కావడం ఖాయం. అనంతరం అతడు ఐపీఎల్ 2026 ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్, ప్రపంచకప్‌, ఐపీఎల్ 2026లో రాణిస్తే.. వైభవ్‌ కచ్చితంగా బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ దృష్టిలో ఉంటాడు.

 

Exit mobile version