Site icon NTV Telugu

Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!

Vaibhav Suryavanshi History

Vaibhav Suryavanshi History

భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెనోనీ లోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయుష్ మాథ్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్.. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, 10 భారీ సిక్సులు ఉండడం విశేషం.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో నేపాల్‌పై ధాకాలో పంత్ 18 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఎనిమిదేళ్లుగా పంత్ పేరుపై ఉన్న ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. బహుశా భారత యువ సంచలనం వైభవ్ నెలకొల్పిన ఈ రికార్డు బద్దలవడం కష్టమే అని చెప్పాలి. 14 ఏళ్ల వైభవ్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఇంగ్లండ్‌తో వోర్సెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసి జూనియర్ స్థాయిలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

Also Read: BCCI vs BCB: భారత్‌కు బంగ్లాదేశ్ జట్టును పంపం.. మేం ఐసీసీతోనే తేల్చుకుంటాం!

ఐపీఎల్‌లోనూ వైభవ్ తన సత్తా చాటాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతడు.. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన శతకంగా అది రికార్డులకెక్కింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు వైభవ్, విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుత ప్రదర్శనల ఫలితంగా భారత ‘ఏ’ జట్టుకు తొలిసారి పిలుపు అందుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిల్లో వరుసగా రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం భారత క్రికెట్ భవిష్యత్తుగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.

Exit mobile version