Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!

  • నేడు భారత్‌, ఐర్లాండ్‌ రెండో టీ20
  • వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశేనా?
  • సంజు శాంసన్ విమలమైతే
Vaibhav Sooryavanshi Debut

Vaibhav Sooryavanshi Debut

Vaibhav Sooryavanshi Debut Unlikely: ఐర్లాండ్‌తో మొదటి టీ20లో ఊహించని ఓటమిని చవిచూసిన భారత జట్టు.. నేడు జరిగే రెండో టీ20లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఈరోజు సాయంత్రం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు వరుసగా విఫలమవడంతో.. టీమిండియా 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఐర్లాండ్ చేతిలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. అంతేకాదు అన్ని ఫార్మాట్లలో ఐర్లాండ్‌పై భారత్‌కు ఇదే తొలి పరాజయం కావడం విశేషం.

టాప్ ఆర్డర్ వైఫల్యంతో భారీ మూల్యం:

తొలి టీ20లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో కనిపించిన ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హిట్టర్లు తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా రాణించకపోవడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే దూకుడుగా ఆడి భారత ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. 20 బంతుల్లో 49 రన్స్ చేశాడు.

ఐర్లాండ్ యువ పేసర్ల అద్భుత ప్రదర్శన:

ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన యువ పేసర్లు జై మూంద్రా, మ్యాట్ హోలార్డ్ భారత బ్యాటింగ్‌ను కుదేలు చేశారు. జై మూంద్రా తన అంతర్జాతీయ కెరీర్‌లో వేసిన తొలి బంతికే సంజు శాంసన్ వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. మరోవైపు మ్యాట్ హోలార్డ్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు పడగొట్టి మూడు కీలక వికెట్లతో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇద్దరి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు భారత బ్యాటర్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశేనా?:

తొలి మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అందరూ ఆశించినా.. బుడ్డోడికి అవకాశం రాలేదు. రెండో టీ20లో కూడా ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైనందుకే టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయాలనే ఆలోచన టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేదని సమాచారం. కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా మార్పులు ఇష్టపడడు. వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటే బ్యాటింగ్ కూర్పులో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపై జట్టు నమ్మకం ఉంచిందట. దాంతో వైభవ్ టీమిండియా అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది.

సంజు విమలమైతే:

సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడి రెండో మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా సంజు మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా అతడు విఫలమైతే.. అంతే సంగతులు. సంజు విమలమైతే త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉంటాయి. రెండో టీ20 మ్యాచ్ భారత్‌కు ‘డూ ఆర్ డై’గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడిపోతే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బాధ్యతాయుతంగా ఆడితేనే టీమిండియా సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంటుంది. అభిమానులంతా ఇప్పుడు రెండో టీ20లో భారత్ ఎలా పుంజుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.