Site icon NTV Telugu

Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!

Vaibhav Sooryavanshi Century

Vaibhav Sooryavanshi Century

Vaibhav Sooryavanshi Century: అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లో సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. కానీ కొందరు యువ క్రికెటర్లు ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా.. శతకాలు బాది చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ కూడా ఉన్నాడు. 2026 అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో నమోదైన శతకాలు లిస్ట్ ఓసారి చూద్దాం.

హరారే వేదికగా జరుగుతున్న 2026 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌పై అజేయంగా 175 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. వైభవ్ దంచుడుకు ఇంగ్లాండ్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వైభవ్ ఆట భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయంగా నిలిచింది. టౌన్స్‌విల్లే వేదికగా 2012 ఫైనల్‌లో ఉన్ముక్త్ చంద్ ఆస్ట్రేలియాపై సెంచరీ (111 నాటౌట్) చేసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడి ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో అలానే ఉంది.

అండర్-19 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ ప్రత్యేక స్థానం ఉంది. 1988 ఫైనల్‌లో బ్రెట్ విలియమ్స్ పాకిస్థాన్‌పై 108 పరుగులు చేసి తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు. అలాగే 2002 ఫైనల్‌లో జారెడ్ బర్క్ దక్షిణాఫ్రికాపై అజేయ శతకం (100 నాటౌట్) సాధించి ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేశాడు. ఇంగ్లాండ్ తరఫున 1998 ఫైనల్‌లో స్టీఫెన్ పీటర్స్ న్యూజిలాండ్‌పై 107 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత తరఫున మరో చిరస్మరణీయ ప్రదర్శనగా 2018 ఫైనల్‌ నిలిచింది. మంజోత్ కల్రా ఆస్ట్రేలియాపై (101 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మొత్తంగా చూస్తే.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వచ్చిన ఈ శతకాలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. భవిష్యత్తు క్రికెట్‌ను మార్చిన ఇన్నింగ్స్‌లు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన చారిత్రక క్షణాలు.

Exit mobile version