Tim Southee Replaced Kane Williamson As New Zealand Test Captain: న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. వర్క్ లోడ్ కారణంగా తాను టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కేన్ వెల్లడించాడు. అయితే.. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా కొనసాగుతూ, టెస్ట్ సభ్యుడిగా ఉంటానని తెలిపాడు. కేన్ టెస్ట్ కెప్టెన్‌గా తప్పుకున్న నేపథ్యంలో.. అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ (ఎన్‌జెడ్‌సీబీ) టిమ్ సౌథీని టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఈ నెల 26వ తేదీ నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే 2 టెస్ట్‌ల సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేసింది.
నిజానికి.. టామ్ లాథమ్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారేమోనని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. విలియమ్సన్ లేనప్పుడు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లకు అతడు నాయకత్వం వహించాడు. ఆ తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు గెలవగా, ఐదు ఓడిపోయింది. రీసెంట్‌గా స్వేదశంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు కూడా అతడు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. దీంతో, లాథమ్‌కే పట్టం కట్టొచ్చని భావించారు. కానీ.. అనూహ్యంగా సౌథీకి ఫాస్ట్ బౌలర్‌గా మంచి అనుభవం ఉండటంతో, అతడ్నే కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడే సరైన ఎంపిక అంటూ కోచ్ గేరీ స్టెడ్ పేర్కొన్నారు. టిమ్ అండ్ టామ్ ఇద్దరూ మంచి లీడర్లేనని.. అయితే ప్రస్తుతం టీమ్‌ని కెప్టెన్‌గా నియమించడమే సరైనదిగా భావించి, అతడ్ని ఎంపిక చేయడం జరిగిందని గేరీ పేర్కొన్నాడు. ఒకవేళ టిమ్ అందుబాటులో లేనప్పుడు.. జట్టుకి టామ్ నాయకత్వం వహిస్తాడని తెలిపాడు.
కాగా.. ఆరేళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్, ఇప్పుడు సడెన్‌గా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌తో పాటు మరెన్నో విజయాలను నమోదు చేసింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ విలియమ్సన్.. న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.