Site icon NTV Telugu

Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!

Tilak Varma Form

Tilak Varma Form

Tilak Varma Form raise concerns Before T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌ దశను డిపెండింగ్ ఛాంపియన్ భారత్‌ అజేయంగా ముగించింది. అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్‌లను ఓడించి గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచింది. ఇక సూపర్‌-8 పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తర్వాత అంత ఆధిపత్యం చలాయిస్తోన్న టీమ్ ఏదన్నా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. ప్రస్తుతం సూర్య సేన వరుస విజయాలు సాధిస్తున్నా.. టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, తెలుగు ఆటగాడు తిలక్ వర్మల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా తిలక్ వర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ మినహా.. అతని గణాంకాలు గొప్పగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం, ఎక్కువ డాట్ బాల్స్ ఆడటం తిలక్ ఆటలో ప్రధాన బలహీనతలుగా విశ్లేషకులు చెబుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్ అత్యంత కీలకం. తిలక్ స్ట్రైక్‌రేట్ కూడా తక్కువగా ఉండడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2026లో మూడు మ్యాచులలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూన నెదర్లాండ్స్‌ కూడా 27 బంతులు ఆడి 31 రన్స్ మాత్రమే చేశాడు.

అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తిలక్ వర్మకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సీనియర్ శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వకుండా.. తిలక్‌ను కొనసాగించడం కూడా మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. యువ ఆటగాడికి అవకాశాలు ఇస్తూ పెద్ద టోర్నీలకు సిద్ధం చేయాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తిలక్ మాత్రం దూకుడైన ఇన్నింగ్స్ ఆడడం లేదు.

Also Read: Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ చరిత్ర!

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 దశలో భారత్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్‌లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి బలమైన జట్లు ఉన్నాయి. సెమీస్ చేరాలంటే.. వేగంగా పరుగులు చేయడం చాలా కీలకం. ఈ సమయంలో స్ట్రైక్‌రేట్ సమస్య కొనసాగితే.. అది జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. మరి ఇప్పటికైనా తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్ మెరుపుపర్చుకుంటాడో లేదో చూడాలి. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడినా. అతడిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చు. లేదంటే టీమ్ కాంబినేషన్‌పై మేనేజ్‌మెంట్ మరోసారి ఆలోచించే పరిస్థితి రావచ్చు.

Exit mobile version