India vs New Zealand: క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన రెండో టీ20లో మన తెలుగు కుర్రాళ్లు ఊచకోత కోశారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకానొక దశలో టీమిండియా ఓటమి అంచుల్లో నిలబడగా, తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి కలిసి కివీస్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. మైదానంలో పరుగుల సునామీ సృష్టించి 4 వికెట్ల తేడాతో భారత్‌కు అదిరిపోయే విజయాన్ని అందించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (58) మెరుపులతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మిడిలార్డర్ వరుసగా చేతులెత్తేసింది. ఒకానొక దశలో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వైపు మొగ్గింది. ఇలాంటి కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ తిలక్ వర్మ, ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఒత్తిడి పతాక స్థాయికి చేరిన వేళ, ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు జోడించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. తిలక్ వర్మ కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లోనే 26 రన్స్ చేసి కివీస్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. వీరిద్దరి వీరవిహారంతో భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విదేశీ గడ్డపై మన తెలుగు కుర్రాళ్లు చూపించిన తెగువకు ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

