భారత్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించారు. టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే పరిమితం చేయాలని, ఆ మాటలను మర్చిపోకుండా కసితో పోరాడాలన్నారు. అలాగే ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ వ్యాఖ్య విషయంలో ఆయన మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని బవుమా అభిప్రాయపడ్డారు. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల భారత్‌లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు నిర్వహించారు. ఈ సిరీస్‌లో టెస్టుల్లో దక్షిణాఫ్రికా 25 ఏళ్ల తర్వాత భారత్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించగా.. వైట్‌బాల్ సిరీస్‌లను మాత్రం కోల్పోయింది. మొత్తం టూర్ పెద్దగా ఉద్రిక్తతలేమీ లేకుండా సాగినా.. కొన్ని సంఘటనలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో టెంబా బవుమా కీలక విషయాలు వెల్లడించారు. ‘తొలి టెస్టులో తొలి రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తమ భాషలో నా గురించి ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో నాకు అది వినిపించలేదు. ఆ చివరకు ఇద్దరు వచ్చి క్షమాపణలు చెప్పారు. అసలు విషయం ఏమిటో మా మీడియా మేనేజర్ ద్వారా తెలుసుకున్నా’ అని బవుమా తెలిపారు.
‘మైదానంలో జరిగేవి మైదానం వరకు మాత్రమే పరిమితం చేయాలి. కానీ వారు అన్న మాటలను గుర్తుంచుకుని కసితో పోరాడాలి. ఎవరిపై కక్ష పెట్టుకోకూడదు. ఆటతోనే సమాధానం చెప్పాలి. నాకు ఎలాంటి వ్యక్తిగత విరోధాలు లేవు’ అని టెంబా బవుమా స్పష్టం చేశారు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ అతడిని ‘బౌనా’ (మరగుజ్జు) అని పిలిచారు. ‘గువాహటీలో జరిగిన రెండో టెస్టు సమయంలో కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలు కొంత బాధగా అనిపించాయి. మీడియా నుంచి నాపై కూడా ఒత్తిడి వచ్చింది. అయితే ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సింది కోచ్ అని భావించాను. ఆయన కూడా తన తప్పును అంగీకరించారు’ అని బవుమా చెప్పుకొచ్చారు.
