Site icon NTV Telugu

IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఆసియా కప్‌లో బోణీ

Hardik Pandya

Hardik Pandya

IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. 15 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాక జడేజాతో ఆచితూచి ఆడాడు. 19వ ఓవర్‌లో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టడంతో టీమిండియా విజయం ఖరారైంది. జడేజా 35 పరుగులు చేశాడు. పాండ్యా (33 నాటౌట్) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు సాధించారు. ఈ విజయంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.

మరోవైపు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 10 పరుగులు చేయగానే టీ20ల్లో అత్యధిక పరుగులు(3,499) చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. కాగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌(3,497 పరుగులు) రెండో స్థానంలో, విరాట్‌ కోహ్లీ(3,308 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.

Exit mobile version