NTV Telugu Site icon

Team India Won: ఉత్కంఠ పోరులో టీమిండియా విక్టరీ..

Team India

Team India

కరేబియన్‌ పర్యటనను విజయంతో ప్రారంభించింది… టీమిండియా. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో… 3 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. ఆఖరి బంతి దాకా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ భారత యువజట్టు.. విజేతగా నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు… ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో… గిల్‌ రనౌట్‌ కావడంతో… సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. 53 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగులు చేశాడు… గిల్‌. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ధాటిగా ఆడాడు… ధవన్‌. ఇద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌… 97 పరుగుల దగ్గర ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా హాఫ్‌ సెంచరీ తర్వాత పెవిలియన్‌ చేరాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్ రాణించలేకపోయినా… చివర్లో దీపక్‌ హుడా, అక్సర్‌ పటేల్‌ ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు చేసింది… టీమిండియా.

Read Also: BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్‌ పొలిటీషియన్‌

ఇక, 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌… ఆచితూచి ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఐదో ఓవర్లోనే ఓపెనర్‌ హోప్‌ వికెట్‌ కోల్పోయినా… మరో ఓపెనర్‌ కైల్, వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూక్స్‌… టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్‌కు ఇద్దరూ వంద పరుగులకు పైగా జోడించారు. కైల్‌ 75 రన్స్‌ చేస్తే, బ్రూక్స్‌ 46 పరుగులు తీశాడు. ఐదు పరుగుల వ్యవధిలో ఇద్దరూ ఔటైనా… ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఏ మాత్రం ఒత్తడికి లోనుకాకుండా ఆడారు. బ్రాండన్‌ కింగ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ఔటైతే… పూరన్‌ ధాటిగా ఆడే ప్రయత్నంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 196 పరుగులకు 5 వికెట్లు పడిపోవడంతో… విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఆడారు. దాంతో రన్‌రేట్‌ పెరిగిపోయింది. చివర్లో షెపర్డ్‌, హోసన్‌ ధాటిగా ఆడి… ధవన్‌ సేనను కంగారు పెట్టారు. చివరి ఓవర్లో విండీస్‌ విజయానికి 15 పరుగులు అవసరం కాగా… సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 11 రన్సే ఇచ్చాడు. దాంతో… చివరి బంతికి 3 పరుగుల తేడాతో నెగ్గింది ధవన్‌ సేన. భారత బౌలర్లలో సిరాజ్‌, కృష్ణ, చాహల్‌ తలో రెండు వికెట్లు తీశారు. 97 పరుగులు చేసిన కెప్టెన్‌ ధవన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. ఇక రెండో వన్డే రేపు జరగనుంది.