Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్‌కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో బుమ్రా గాయం బీసీసీఐ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. బుమ్రా జట్టుకు దూరమైతే జట్టు విజయావకాశాలు దెబ్బతింటాయని టీమిండియా భావిస్తోంది.
Read Also: జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?
ఆసియాకప్ ఉపఖండంలో జరగుతుండటంతో స్పిన్నర్ల ప్రదర్శనపై టీమిండియా ఆధారపడింది. కానీ టీ20 ప్రపంచకప్ పేసర్లకు స్వర్గధామమైన ఆస్ట్రేలియాలో జరగబోతోంది. ఆస్ట్రేలియాలో విజయం సాధించాలంటే ఫాస్ట్ బౌలర్లు రాణించాలి. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్ కీలకంగా కనిపిస్తున్నారు. ఆసియా కప్ వరకు టీమిండియా కవర్ చేసుకున్నా టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లను ఎదుర్కోవాలంటే పేస్ దళం గట్టిగా ఉండాల్సిందే. ఒకవేళ బుమ్రా దూరమైతే సెలక్టర్లు షమీని జట్టులోకి తీసుకువస్తారేమో వేచి చూడాలి. ఇటీవల కాలంలో టీ20లకు షమీని టీమ్ మేనేజ్‌మెంట్ దూరంగా ఉంచుతోంది. కేవలం టెస్టులకు మాత్రమే షమీని పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బుమ్రా త్వరగా కోలుకోవాలని.. తిరిగి సాధ్యమైనంత త్వరగా జట్టులో చేరాలని ఆశిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.
