Site icon NTV Telugu

IND Vs SA: గౌహతిలో టీమిండియా పరుగుల సునామీ.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్

Surya Kumar Yadav

Surya Kumar Yadav

IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేయగా.. రోహిత్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. వీళ్లిద్దరినీ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తన బుట్టలో వేసుకున్నాడు.

Read Also:IND Vs SA: లైవ్ మ్యాచ్‌లో విశేష అతిథి.. వణికిపోయిన క్రికెట్ అభిమానులు

ఓపెనర్లు అవుటైనా సూర్యకుమార్ ఉండటంతో భారత్ భారీ స్కోరు చేస్తుందని అభిమానులు విశ్వసించారు. అనుకున్న విధంగా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్ని్ంగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో సూర్యకు ఇది 9వ హాఫ్ సెంచరీ. అతడు రనౌట్ కాకుండా ఉంటే భారత్ 250 పరుగులు చేసి ఉండేది. సూర్యకుమార్‌కు తోడుగా కోహ్లీ కూడా రాణించాడు. కోహ్లీ 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ 7 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఓవరాల్‌గా టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 238 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కూడా సొంతం చేసుకుంటుంది.

Exit mobile version