2025 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు మరపురాని ఏడాదిగా నిలిచింది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ట్రోఫీలు గెలుచుకుని.. ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 4 విజయాలు సాధించగా.. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెస్టుల్లో కొన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా.. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుల ప్రదర్శన ఆకట్టుకుంది. వన్డే క్రికెట్‌లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. 2025లో 14 వన్డేలు ఆడిన టీమిండియా.. అందులో 11 మ్యాచ్‌లు గెలిచి కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. రోహిత్ శర్మ నాయకత్వంలో తొలి 8 వన్డేల్లో ఒక్క ఓటమి కూడా లేదు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది.
Also Read: Sankranti 2026 Movies: కలర్ ఫుల్ సంక్రాంతి.. హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ గురూ!
ఇక టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. మొత్తం 22 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 14 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. మరో 3 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. 2025లో భారత్ ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అంతేకాదు ఆసియా కప్‌ను గెలుచుకుని టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపింది. మొత్తంగా చూస్తే.. 2025లో టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శనతో పాటు ట్రోఫీ విజయాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. రోహిత్ శర్మ వ్యూహాత్మక నాయకత్వం భారత క్రికెట్‌కు మరో గొప్ప ఏడాదిని అందించిందని చెప్పవచ్చు.
