టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరత్వం, గెలుపు పరంపర కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. అయితే భారత జట్టు ఈ విషయంలో ప్రపంచ క్రికెట్‌లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (FM Teams) మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంగా భారత్ అద్భుత రికార్డులు నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 11 వరుస టీ20 అంతర్జాతీయ సిరీస్‌లను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరంపర 2024 నుంచి కొనసాగుతోంది.
దాయాది పాకిస్థాన్ కూడా 2016–2018 మధ్య 11 వరుస సిరీస్ విజయాలు సాధించింది. అయితే ప్రస్తుతం భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. టీమిండియా రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. 2017–18 మధ్య 7 వరుస సిరీస్‌లు, 2019–21 మధ్య 6 వరుస సిరీస్‌లు గెలుచుకొని టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని చూపించింది. ఈ గణాంకాలు భారత జట్టు ఎంత కాలంగా టీ20ల్లో స్థిరంగా ప్రదర్శిస్తోందో స్పష్టంగా చెబుతున్నాయి.
Also Read: Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రికార్డు ట్రెండ్!
స్వదేశంలో వరుస సిరీస్ విజయాల విషయంలో భారత్ ముందంజలో ఉంది. 2022 నుంచి 2026 వరకు భారత్ స్వదేశంలో 10 వరుస టీ20 సిరీస్‌లను గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 2006–10 మధ్య 8 వరుస సిరీస్‌లు, భారత్ 2019–22 మధ్య 7 సిరీస్‌లు, పాకిస్థాన్ 2008–18 మధ్య 5 వరుస సిరీస్‌లు గెలుచుకున్నాయి. మొత్తంగా చూస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస సిరీస్ విజయాల పరంగా భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు, ఆగ్రసివ్ ఆటతీరు భారత్‌ను పొట్టి ఫార్మాట్‌లో అజేయ శక్తిగా నిలబెడుతోంది. ఈ విజయ పరంపర ఇంకా ఎంత దూరం సాగుతుందో చూడాలి.
