NTV Telugu Site icon

Team India: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీకి అవకాశం ఇవ్వని సెలక్టర్లు

Virat Kohli

Virat Kohli

Team India For Zimbabwe Tour: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే వెళ్లే భారత జట్టును శనివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఫామ్‌తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపిక చేస్తారని గతంలో జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. సెలక్టర్లు కోహ్లీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విరాట్ మళ్లీ ఆసియా కప్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో టీమిండియా యువజట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ మరోసారి భారతజట్టును నడిపించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌తో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. అటు కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వాషింగ్టన్ సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. కాగా జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా ఆసియాకప్ మొదలు కానుంది.

Read Also:Sprite Cool Drink: రంగు మార్చిన ‘స్ర్పైట్’.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి..!!

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Show comments