Gulbadin Naib Acting Video Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో భారత్ చేతిలో ఓడినా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే బంగ్లా మ్యాచ్ సందర్భంగా అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ ఇన్‌జూరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా మైదానంలో పడిపోయిన నైబ్.. అఫ్గాన్ గెలవగానే వేగంగా పరుగెత్తడం గమనార్హం. నైబ్ ‘ఫేక్ ఇన్‌జూరీ’ డ్రామా ఆడాడని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
గుల్బాదిన్ నైబ్‌ది ‘ఆస్కార్’ యాక్టింగ్ అంటూ కొందరు మాజీలు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ గాయం నిజం కాదని తేలితే.. అతడిపై ఐసీసీ బ్యాన్ విధించే అవకాశం లేకపోలేదు. మరి ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయంటే.. ఓ ప్లేయర్ దురుద్దేశంతో కావాలనే సమయం వృథా చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆర్టికల్ 2.10.7 లెవల్ 1 లేదా 2 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ భావిస్తుంది. ఇది నిజమని తేలితే.. మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లను ఖాతాలో చేర్చుతారు. ఒక ఏడాదిలో ప్లేయర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు ఉంటే.. ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/రెండు టీ20ల నుంచి వేటు పడుతుంది.
Also Read: T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: అక్తర్
అంతేకాదు ఫేక్ ఇన్‌జూరీ అని సమయాన్ని వృథా చేసినప్పుడు… ఆర్టికల్ 41.9 ప్రకారం ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో ఇస్తారు. ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అఫ్గానిస్థాన్ -బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఇలా జరగలేదు. ఇక సోషల్ మీడియాలో గుల్బాదిన్ నైబ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఐసీసీకి మాత్రం అధికారికంగా ఏ ఫిర్యాదు అందలేదు. మ్యాచ్ రిఫరీ కూడా విచారణ చేపట్టాలని అడగలేదని తెలుస్తోంది.