T20 World Cup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతూ తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), పంత్ (9) దారుణంగా విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అతడు 52 పరుగులు చేసి అవుటయ్యాడు. దీపక్ హుడా (22), హార్దిక్ పాండ్యా (27) రాణించారు. వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా బౌలర్లలో బెహండార్ఫ్, కెల్లీ చెరో రెండు వికెట్లు సాధించారు. జె.రిచర్డ్ సన్, ఆండ్రూ టై తలో వికెట్ తీశారు.
Read Also: Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు
అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఫానింగ్ (59) మాత్రమే రాణించాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు ఓవర్లు వేసి ఒక మెయిడిన్ సహా ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు రాణించడం అభిమానులకు ఊరట కలిగించింది. మరి ప్రధాన టోర్నీలోనూ భారత బౌలర్లు ఇలాగే రాణించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
