Danish Kaneria Slams Pakistan Team after T20 World Cup 2024 Exit: టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. పొట్టి కప్ కోసం పీసీబీ సెలెక్టర్లు చెత్త జట్టును ఎంపిక చేశారన్నాడు. పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది సిగ్గుచేటని, ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లు పసికూన జట్లు జింబాబ్వే, ఐర్లాండ్‌పై మాత్రమే చెలరేగుతారని కనేరియా విమర్శించాడు. టీ20 ప్రపంచకప్ 2024 లీగ్ దశలోనే పాక్ ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.
ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డానిష్ కనేరియా మాట్లాడుతూ… ‘పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. గెలుపు, ఓటములు క్రికెట్‌లో భాగమేనని కొందరు అంటారు. క్రికెటర్ల కెరీర్‌తో ఆడుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. అయినా కూడా వారికి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు. అహ్మద్ జమాల్, షానవాజ్ దహాని, మహమ్మద్ హస్నైన్ వేచి చూస్తేనే ఉన్నారు’ అని అన్నాడు.
Also Read: Vijay Thalapathy: విజయ్ కీలక నిర్ణయం.. ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు!
‘పాకిస్తాన్ జట్టు కేవలం బాబర్ ఆజామ్, మొహ్మద్ రిజ్వాన్ మీదనే ఆధారపడినట్లుంది. జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి చిన్న టీమ్‌లపైనే పాక్ కెప్టెన్ భారీగా పరుగులు చేస్తుంటాడు. అలాంటి క్రికెటర్‌ను విరాట్ కోహ్లీతో పోల్చడం దారుణం.టీ20 ప్రపంచకప్ 2024 ముందు ఇంగ్లండ్, ఐర్లాండ్‌కు పాక్ జట్టును పంపించి ఉండకూడదు. ఆ సమయంలో యూఎస్‌లో ఆడిస్తే బాగుండేది. పొట్టి కప్ కోసం పీసీబీ సెలెక్టర్లు ప్రకటించిన జట్టు కూడా చెత్తదే’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.