T20 World Cup Controversy: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లాభాల కోసమే తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నఖ్వీ, తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంక లాంటి న్యూట్రల్ వేదికలకు మార్చాలన్న డిమాండ్ నేపథ్యంలో టోర్నీ నుంచి తప్పించబడినందుకు సంఘీభావంగా పాక్ కూడా వరల్డ్‌కప్‌లో పాల్గొనక పోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ నిజంగానే అలాంటి ఆలోచనలో ఉంటే, భారత్‌కు రావద్దంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉపఖండంలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్‌కు ఫేవరెట్‌గా ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్‌లో ఆడితే ఘోరంగా ఓడిపోతుందని శ్రీకాంత్ పేర్కొన్నారు.
గత మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లలో 209 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలోనే 150 పరుగులు సాధించింది.. ఇది చూసి కొన్ని జట్లు ‘మేము రావడం లేదు, కప్ మీరే ఉంచుకోండి’ అని చెప్పే పరిస్థితికి వచ్చాయని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. పాకిస్తాన్‌కు నా సూచన- మీరు రావొద్దు.. మీ మొహ్సిన్ నఖ్వీ కూడా అదే అంటున్నారు కదా, అయితే రాకండి అని హెచ్చరించాడు. మిమ్మల్ని మైదానంలో చిత్తు చేస్తారు.. కొలంబోలో కొట్టిన సిక్స్ మద్రాస్‌లో పడేలా ఉంది.. జాగ్రత్త, రాకుండా ఏదైనా కారణం చెప్పి తప్పించుకోవడమే పాకిస్థాన్ కి ఉత్తమం అంటూ విమర్శించారు. ఇలాంటి దూకుడు బ్యాటింగ్‌ను టీ20 క్రికెట్‌లో తాను ఎప్పుడూ చూడలేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
Read Also: Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్‌కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !
అయితే, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యల అనంతరం కొద్ది గంటలకే పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్టును ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జట్టు ప్రకటన తర్వాత నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాకిస్తాన్ మేనేజ్‌మెంట్ కీలక విషయాన్ని వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి రాలేదని, తుది నిర్ణయం ప్రభుత్వ చేతుల్లోనే ఉందని స్పష్టం చేసింది. ఇక, క్రికెట్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ రాజకీయ రంగు పులుముతున్న ఈ పరిణామాలు, రాబోయే టీ20 వరల్డ్‌కప్‌పై అనిశ్చితిని పెంచుతున్నాయి. పాకిస్తాన్ నిజంగా టోర్నీ నుంచి తప్పుకుంటుందా? లేక చివరి నిమిషంలో నిర్ణయం మారుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
