NTV Telugu Site icon

Indian Cricket Team: పాకిస్థాన్‌ ‘డాన్‌’ పత్రిక మొదటి పేజీలో టీమిండియా ఫొటో!

Team India Dawn

Team India Dawn

Indian Cricket Team Photo on Dawn’s front page: టీ20 ప్రపంచకప్‌ 2024 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్ సమరంలో భారత్‌ 7 పరుగుల తేడాతో గెలిచి.. పొట్టి ప్రపంచకప్‌ను రెండోసారి కైవసం చేసుకుంది. టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించింది.

‘గేరు మార్చి భారత్‌కు కప్పు అందించిన విరాట్ కోహ్లీ’ అంటూ లండన్‌కు చెందిన సండే టైమ్స్‌ తమ కథనంలో పేర్కొంది. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించలేని దక్షిణాఫ్రికా.. మరోసారి అదే ధోరణిని కొనసాగించిందని రాసుకొచ్చింది. ‘ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైన దక్షిణాఫ్రికా.. భారత్‌కు కప్పు అందజేసింది’ అంటూ బ్రిటీష్ డైలీ బ్రాడ్‌షీట్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్‌ పేర్కొంది. ‘టోర్నమెంట్‌ ఆసాంతం ఇబ్బందిపడినప్పటికీ.. కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు’ అని ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్‌ క్రికెట్‌ విశ్లేషించింది.

Also Read: Kalki 2898 AD Collections: ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘కల్కి 2898 ఏడీ’!

ఇక దాయాది పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్‌’ పత్రిక భారత జట్టుపై ప్రశంసలు కురిపించింది. విరాట్ కోహ్లీ ఆటతీరును ప్రత్యేకంగా కొనియాడింది. టీమిండియా విజయోత్సాహాలకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రచురించింది. దాంతో భారత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ మీడియా టీమిండియాను కొనియాడుతూ కథనాలు ప్రచురించగా.. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ మాత్రం ప్రపంచకప్ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. భారత జట్టుకు అన్నీ అనుకూలించాయని, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు టీమిండియా కప్పు గెలిచిందని పేర్కొంది. సూపర్‌-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడాన్ని జీర్ణించుకోలేకే ఇలా అక్కసు వెళ్లగక్కిందని క్రీడానిపుణులు అంటున్నారు.