It will be difficult for Pakistan to qualify for the T20 World Cup 2024 Super 8: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2024లో మాదిరి భారీ స్కోర్లు నమోదవకున్నా.. సూపర్ ఓవర్లు, ఉత్కంఠ ఫలితాలతో మెగా టోర్నీ మ్యాచ్‌లు అభిమానులకు మంచి మజాను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పసికూన జట్లు ఐసీసీ టాప్ టీమ్స్‌కు షాక్ ఇస్తూ సంచనాలు నమోదు చేస్తున్నాయి. దాంతో కొన్ని టాప్ టీమ్స్ సూపర్ 8కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టే పరిస్థితి నెలకొంది. ఈ జాబితాలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఉంది.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌లు (ఐర్లాండ్, పాకిస్తాన్) గెలిచిన భారత్ 4 పాయింట్స్‌తో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో కెనడా, అమెరికాలతో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. టీమిండియా కనీసం ఒకటి గెలిచినా సూపర్ 8కు చేరుతుంది. పాకిస్థాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా.. 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో (భారత్, ఐర్లాండ్) ఒక్కటి గెలిచినా యూఎస్ ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. రన్‌రేట్ కూడా 0.626తో మెరుగ్గానే ఉండడంతో సూపర్ 8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఓడిన పాకిస్థాన్.. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ స్టేజ్‌లో నుంచే నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూఎస్, భారత్ చేతుల్లో ఓడిన పాక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, కెనడాతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా.. పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. అదే సమయంలో రన్‌రేట్ కూడా బాగుండాలి. పాక్ సూపర్ 8 చేరాలంటే యూఎస్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. ఒక్కటి గెలిచినా.. పాక్ పని ఔట్. పాక్ భవితవ్యం మొత్తం ఇప్పుడు యూఎస్ మీద ఆధారపడి ఉంది.
Also Read: Rohit Sharma: ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది: రోహిత్
కెనడా ఓ మ్యాచ్‌లో గెలిచి.. మరోదాంట్లో ఓడి మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్, భారత్‌లతో కెనడా ఆడాల్సి ఉంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి కెనడాకు అంత ఈజీ కాదు. ఐదవ స్థానంలో ఉన్న ఐర్లాండ్.. భారత్, కెనడాపై ఓడింది. యూఎస్, పాకిస్తాన్ జట్లతో ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ ప్రస్తుత ఫామ్ చూస్తే గెలుపు కష్టమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ లేదా ఐర్లాండ్ సూపర్ 8కు చేరుకోవు.