Site icon NTV Telugu

T20 World Cup 2024: న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. స్టార్‌లకు దక్కని చోటు!

New Zealand Squad

New Zealand Squad

New Zealand Squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2024 జూన్‌ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్ లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు నేడు (ఏప్రిల్‌ 29) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించనున్నాడు. ఫామ్‌ లేని కొందరి ఆటగాళ్లపై వేటు వేసిన కివీస్ బోర్డు.. గాయపడిన మరికొందరు ప్లేయర్లను పక్కనపెట్టింది.

గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్, ఆల్‌రౌండర్ ఆడమ్ మిల్నేలు టీ20 ప్రపంచకప్‌ 2024కు దూరమయ్యారు. మిల్నే స్థానంలో మ్యాట్‌ హెన్రీ చోటు దక్కించుకున్నాడు. ఫామ్‌లో లేని స్టార్ ప్లేయర్స్ టామ్‌ బ్లండెల్‌, టామ్ లాథమ్, టిమ్ సీఫెర్ట్‌లు జట్టుకు ఎంపిక కాలేదు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ డెవాన్‌ కాన్వేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వికెట్‌కీపర్‌ ఫిన్‌ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. తుది జట్టులో కాన్వేనే కీపింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

తాజాగా జట్టు సారథ్య బాధ్యతలు మోసిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌, జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా ఐష్‌ సోధి, మిచెల్‌ సాంట్నార్‌ ఉండగా.. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ పేస్ కోటాలో ఎంపికయ్యారు. మెగా టోర్నీ కోసం న్యూజిలాండ్‌ మే 23న బయల్దేరనుంది. జూన్‌ 7న ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

న్యూజిలాండ్‌ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ.
ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్

Exit mobile version