Rohit Sharma Happy For New York Fans: భారత్ ఎక్కడ ఆడినా అభిమానులు తమని నిరాశపరచరని, న్యూయార్క్ ప్రేక్షకుల మద్దతు అద్భుతం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈరోజు ఫాన్స్ అందరూ చిరునవ్వుతో ఇంటికి వెళతారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఇంకా చాలా దూరం ప్రయాణించాలని హిట్‌మ్యాన్ చెప్పాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘మేం సరిగా బ్యాటింగ్ చేయలేదు. సగం ఇన్నింగ్స్ వరకు మేము మంచి స్థితిలో ఉన్నాము. త్వరగా వికెట్లను కోల్పోయాం. సరైన భాగస్వామ్యాలను నిర్మించలేదు. మేం అనుకున్నంత లక్ష్యాన్ని పాకిస్థాన్‌కు నిర్దేశించలేకపోయాం. ఈ పిచ్‌పై ప్రతి పరుగూ అత్యంత కీలకం అని మేం చర్చించుకున్నాం. పిచ్ బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే.. గత మ్యాచ్‌తో పోలిస్తే మంచి వికెట్. విజయం సాదించేందుకు ఈ లక్ష్యం సరిపోతుందని భావించాం. మా బౌలింగ్ లైనప్‌పై చాలా నమ్మకం ఉంది’ అని చెప్పాడు.
Also Read: Babar Azam: గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్
‘ఆరంభంలో పాకిస్తాన్ బ్యాటింగ్‌ను చూసిన తర్వాత మ్యాచ్ చేజారుతుందని అస్సలు అనుకోలేదు. ఒక్క వికెట్ తీస్తే చాలు మనం రేసులో ఉన్నట్లేనని అనుకున్నాం. సగం ఇన్నింగ్స్ అయ్యాక మేం మాట్లాడుకున్నాం. మనకు ఏదైతే జరిగిందో.. వాళ్లకూ అదే జరగొచ్చని చెప్పా. ప్రతి ఒకరు తమ పాత్రను చక్కగా పోషించారు. జస్ప్రీత్ బుమ్రా ప్రతి మ్యాచ్‌కూ బలంగా మారుతున్నాడు. అతడు ఏమి చేయగలడో మనందరికీ తెలుసు. బుమ్రా గురించి మరీ ఎక్కువగా మాట్లాడను. అతడు ఎప్పుడూ స్పెషలే. ప్రపంచకప్ ఆసాంతం బుమ్రా ఇదే మైండ్ సెట్‌తో ఉంటే చాలు. న్యూయార్క్ ప్రేక్షకులు మద్దతు అద్భుతం. ఈరోజు మ్యాచ్‌ను బాగా ఆస్వాదించారని అనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. టోర్నీలో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.