Jasprit Bumrah on India Win vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు తాము విధించిన లక్ష్యం సరిపోదనుకున్నాం అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. సూర్యుడి రాకతో వికెట్ మెరుగైందని, పాకిస్థాన్‌పై గెలవడం కష్టమే అనుకున్నాం అని చెప్పాడు. న్యూయార్క్‌లో ప్రేక్షకులను చూశాక.. తాము భారతదేశంలో ఆడినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఈ విజయం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బుమ్రా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.
పాకిస్థాన్‌పై భారత్ గెలవడంతో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ‘బూమ్ బూమ్’ బుమ్రా నిప్పులు చెరిగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి కీలక 3 వికెట్స్ పడగొట్టాడు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న బుమ్రాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అవార్డు తీసుకున్న అనంతరం బుమ్రా మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. మేం తక్కువ పరుగులు చేశాం. పాకిస్థాన్‌కు మేం విధించిన లక్ష్యం సరిపోదనుకున్నాం. సూర్యుడి రాకతో వికెట్ కొంచెం మెరుగైంది. అయినా క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాం. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. వీలైనంత వరకు సీమ్‌నువేసే ప్రయత్నం చేశాను. నా ప్రణాళికలను 10 శాతం అమలు చేశాను’ అని అన్నాడు.
Also Read: Pakistan Super 8: అయ్యో పాపం.. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్థాన్ ఔట్!
‘నా బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు విజయం కోసం కష్టపడ్డారు. పాకిస్థాన్‌పై గెలుపుతో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. న్యూయార్క్‌లో ప్రేక్షకుల మద్దుతు అద్భుతం. భారతదేశంలో ఆడినట్లు అనిపించింది. ఫాన్స్ మద్దతు మైదానంలో మాకు శక్తిని ఇస్తుంది. మేము రెండు గేమ్‌లు ఆడి గెలిచాం. ఇప్పుడు మిగతా రెండింటిపై దృష్టి సారించాము. మా జోరును కొనసాగిస్తాం’ అని జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.