Rohit Sharma React on Retd Hurt in IND vs IRE Match: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరడంతో.. అతడికి ఏమైంది?అని ఫాన్స్ ఆందోళనకు గురయ్యారు.
హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే రోహిత్ శర్మ 10వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజానికి బలంగా తాకింది. ఈ దెబ్బకు హిట్‌మ్యాన్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం నొప్పితోనే బ్యాటింగ్ చేసిన రోహిత్.. హాఫ్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. టీమిండియా ఫిజియోతో కలిసి అతడు మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ దీనిపై స్పందించాడు. భుజం కొద్దిగా నొప్పిగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా రిటైర్డ్ హర్ట్‌గా తాను వెనుదిరిగానని చెప్పాడు.
Also Read: IND vs IRE: విజృంభించిన పేసర్లు.. ఐర్లాండ్‌పై భారత్ అలవోక విజయం!
రోహిత్ శర్మ మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయం కచ్చితంగా మాకు తెలియదు. టాస్ సమయంలో ఇదే విషయం చెప్పా. కొత్త స్టేడియంలో 5 నెలల కిందట తయారు చేసిన ఈ పిచ్‌పై ఎలా ఆడాలో తెలియదు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడం కోసం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ బౌలర్లకు అనుకూలించింది. అయితే క్రీజులో నిలదొక్కుకుంటే… పరుగులు చేయొచ్చు. ఈ మైదానంలో నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోవద్దు. మా తుది జట్టు ఎంపిక బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకుంటున్నాం. పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటే ఓ విధంగా, స్పిన్‌కు సహకరిస్తుందనుకుంటే మరో విధంగా ప్లేయింగ్ 11 ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లు, ఆల్‌రౌండర్లుగా ఉన్న ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నాం. మంచి పేస్ దళం ఉన్న పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి మేం సన్నద్ధమవుతాం’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.