NTV Telugu Site icon

IND vs AFG: అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం.. సూపర్‌-8లో భారత్‌ శుభారంభం!

Team India

Team India

India Beat Afghanistan in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8లో భారత్‌ శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా (3/7), అర్ష్‌దీప్‌ సింగ్ (3/36), కుల్దీప్ యాదవ్ (2/32) సత్తాచాటారు. అజ్మతుల్లా (26) టాప్‌ స్కోరర్‌. అంతకుముందు హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్‌ యాదవ్ (53; 28 బంతుల్లో 5×4, 3×6)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇక భారత్‌ తర్వాతి సూపర్‌-8 మ్యాచ్‌లో శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ శర్మ (8) పెవిలియన్ చేరాడు. లీగ్‌ దశలో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ (24).. ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో రిషబ్ పంత్‌ (20) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 54/1తో భారత్‌ కుదురుకుంటున్నట్లే కనిపించింది. రషీద్‌ ఖాన్ రాకతో భారత్ కుదేలైంది. తన తొలి ఓవర్లో పంత్‌ను.. తర్వాతి ఓవర్లో కోహ్లీని ఔట్ చేశాడు. ఇక మూడో ఓవర్లో శివమ్ దూబె (10)ను కూడా ఔట్‌ చేయడంతో 11 ఓవర్లలో భారత్‌ 90/4తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో సూర్యకుమార్‌ ఎదురుదాడికి దిగాడు. హార్దిక్‌ (32) కూడా షాట్లకు దిగాడు. దీంతో భారత్‌ 17వ ఓవర్లో 150కు చేరుకుంది. ఇన్నింగ్స్ చివరలో సూర్య, హార్దిక్‌ వెనుదిరిగినా.. అక్షర్‌ (12) భారత్ స్కోరును 180 దాటించాడు.

Also Read: Big Breaking: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..

చేధనలో భారత బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్న అఫ్గాన్‌ ఓపెనర్ల ప్రణాళిక పనిచేయలేదు. అర్ష్‌దీప్‌ వేసిన మొదటి ఓవర్లో గుర్బాజ్‌ (11) చెలరేగినా.. రెండో ఓవర్లో బుమ్రా అతడికి కళ్లెం వేశాడు. మరో ఓపెనర్ జజాయ్‌ (2)ను తన రెండో ఓవర్లలో ఔట్‌ చేశాడు. ఇబ్రహీం జద్రాన్‌ (8)ను అక్షర్‌ అవుట్ చేయడంతో 23/3తో అఫ్గాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. నైబ్‌ (17), అజ్మతుల్లా (26), నజిబుల్లా (19), నబి (14) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి పోరాటం జట్టు స్కోరును వంద దాటించడానికి మాత్రమే ఉపయోగపడింది. మధ్య ఓవర్లలో కుల్దీప, జడేజా (1/20) దెబ్బ కొట్టారు. అర్ష్‌దీప్‌ తన చివరి రెండు ఓవర్లలో 3 వికెట్లతో అఫ్గాన్‌ కథ ముగించాడు.