NTV Telugu Site icon

SA vs AFG: పరిస్థితులు అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాం: రషీద్‌ ఖాన్‌

Rashid Khan

Rashid Khan

Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్‌ సారథి రషీద్‌ ఖాన్‌ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరింత హార్డ్‌వర్క్‌ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం అని రషీద్‌ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 సెమీఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గాన్‌ చిత్తుచిత్తుగా ఓడింది.

మ్యాచ్ అనంతరం అఫ్గాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ… ‘ఈ ఓటమిని జీర్ణించుకోవడం జట్టుగా చాలా కష్టం. మేం అనుకున్నది చేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. మంచి ప్రదర్శన చేయాల్సి ఉన్నప్పటికీ.. పిచ్‌ అనుకూలించలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అదే టీ20 క్రికెట్‌. దక్షిణాఫ్రికా బాగా బౌలింగ్‌ చేసింది. ఈ టోర్నమెంట్‌లో మేము మంచి విజయాలు సాధించామని అనుకుంటున్నాను. మా సీమర్లు బాగా బౌలింగ్ చేసారు’ అని తెలిపాడు.

Also Read: SA vs AFG: తొలిసారిగా ఫైనల్‌కు చేరడం సంతోషం.. ఫైనల్‌ కోసం భయపడటం లేదు: మార్‌క్రమ్‌

‘ఎపుడైనా మంచి ఆరంభాలు కావాలి. ఈ మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకోలేదు. ముజీబ్‌ గాయపడటం మాకు దురదృష్టమే. మా పేసర్లతో పాటు మొహ్మద్ నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. స్పిన్నర్లుగా మా పనిని పేసర్లు సులభతరం చేశారు. ఈ టోర్నీని మేం ఆస్వాదించాం. ప్రొటీస్ వంటి అగ్రశ్రేణి జట్టుపై ఓడిపోవడాన్ని అంగీకరిస్తున్నాం. మెగా టోర్నీలలో మాకు ప్రారంభం మాత్రమే. ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయి. మా ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. మా నైపుణ్యాలను ఉపయోగించడంలో ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి సరిదిద్దుకుంటాం. మిడిలార్డర్‌లో మేం మెరుగుపడాల్సి ఉంది. మరింత హార్డ్‌వర్క్‌ చేసి వచ్చే సిరీస్‌లకు సిద్ధమవుతాం’ అని రషీద్‌ చెప్పుకొచ్చాడు.