T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్‌.. ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్!

  • పొట్టి ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువ
  • హ్యాట్రిక్ సాధించడం బౌలర్లకు చాలా కష్టం
  • ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్
T20 World Cup Hat Tricks

T20 World Cup Hat Tricks

‘టీ20 వరల్డ్‌కప్’ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, అనూహ్య మలుపులతో మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే పొట్టి ఫార్మాట్‌లో ‘హ్యాట్రిక్’ సాధించడం బౌలర్లకు చాలా కష్టం. అలాంటిది కొందరు బౌలర్లు టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్‌ పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌కప్‌లలో కొద్దిమంది బౌలర్లు మాత్రమే ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి దక్కింది. 2007 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై వరుసగా మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అప్పట్లో ఈ ఘనత టీ20 క్రికెట్‌లో బౌలర్లకు కూడా ఎంత ప్రాధాన్యం ఉందో నిరూపించింది. అప్పట్లో బ్రెట్ లీ మంచి ఫామ్ మీదున్నాడు. బ్రెట్ లీ బౌలింగ్ చేస్తున్నాడంటేనే.. స్టార్ బ్యాటర్ కూడా డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. 2007 నుంచి 2021 వరకు మరో హ్యాట్రిక్ పడలేదు.

×
×
Ad

2021 టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్ వరుసగా నమోదయ్యాయి. ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్‌పై హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ దక్షిణాఫ్రికాపై, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ తీసి ఔరా అనిపించారు.

Also Read: T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

2022 టీ20 వరల్డ్‌కప్‌లో అసోసియేట్ దేశాల బౌలర్లు కూడా సత్తా చాటారు. యూఏఈ తరఫున కార్తిక్ మేయప్పన్ శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించగా.. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ న్యూజిలాండ్‌పై ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇది చిన్న జట్ల ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసాధారణ ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్‌పై ఒక హ్యాట్రిక్, ఆఫ్ఘనిస్తాన్‌పై మరో హ్యాట్రిక్ సాధించి ఒకే టోర్నీలో రెండు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిన్స్ ప్రదర్శన టోర్నీకి హైలైట్‌గా నిలిచింది.

2024 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్ అమెరికాపై హ్యాట్రిక్ పడగొట్టాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్ జాబితాలో మరో కొత్త పేరు చేరింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ హ్యాట్రిక్స్ అన్నీ బౌలింగ్ ఎంత కీలకమో మరోసారి రుజువు చేశాయి. అయితే ఇప్ప్పటివరకు భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా హ్యాట్రిక్ తీయలేదు. 2026 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ చూస్తామో చూడాలి. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 2026 వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. పొట్టి టోర్నీలో ఈసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.