Suryakumar Yadav Praises Vaibhav Suryavanshi Six-Hitting Talent: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంత చిన్న వయసులో భారీ సిక్సర్లు కొట్టడం మాములు విషయం కాదన్నాడు. వైభవ్ సిక్సర్లు కొడుతుంటే.. ఒక్కోసారి అతడు మనిషా లేదా రోబోనా అనే సందేహం వస్తుందన్నాడు. క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాల సూపర్ టాలెంట్ కాకుండా.. వైభవ్ సిక్సర్లు కొట్టే ఒక్క సామర్థ్యాన్ని తాను దొంగిలిస్తా అని సూర్యకుమార్ సరదాగా చెప్పాడు.
సిక్సర్లు కొట్టే సామర్థ్యాన్ని దొంగిలిస్తా:
ఇటీవల తన ఆటతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసం అభిమానులను మాత్రమే కాకుండా.. తోటి క్రికెటర్లను కూడా ఆకట్టుకుంటోంది. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. తాజాగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య పాల్గొనగా.. ‘మరో క్రికెటర్‌లోని ఏ స్కిల్‌నైనా మీరు దొంగిలించాలనుకుంటే ఎవరిది దొంగిలిస్తారు?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సూరీడు ఏమాత్రం తడబడకుండా వైభవ్ సూర్యవంశీ పేరు చెప్పేశాడు. ‘ఒక యువ ఆటగాడు ఉన్నాడు. అతడి పేరు మీరు వినే ఉంటారు. అతడే వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సిక్సర్లు కొట్టే సామర్థ్యాన్ని నేను దొంగిలిస్తా’ అని సూర్యకుమార్ చెప్పాడు.
12 ఇన్నింగ్స్‌ల్లో 270 పరుగులే:
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ అందుకున్నాడు. అంతేకాకుండా టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్.. ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్‌కు 2026లో మాత్రం నిరాశపరిచాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 270 పరుగులు మాత్రమే చేశాడు. వరుస పరాజయాలతో సూర్య ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
భారత టీ20 జట్టులో చోటు గల్లంతు:
ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు భారత టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే అంతకుముందు మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2027కు ముందు సూర్యకుమార్ భవిష్యత్తుపై ముంబై ఇండియన్స్‌లో పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ.. అతడు వచ్చే సీజన్‌లోనూ ఫ్రాంచైజీతో కొనసాగనున్నట్లు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన తర్వాత భారత టీ20 జట్టులోకి కూడా అడుగుపెట్టాడు. ప్రస్తుతం 2026 ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ అతడు చోటు దక్కించుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందుకుంటున్న వైభవ్‌పై సూర్యకుమార్ చేసిన ఈ ప్రశంసలు అతడి సిక్సింగ్ సామర్థ్యంపై ఉన్న క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పాయి.

