టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్‌లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో ఆడుతుండటం అతడికి కలిసొచ్చే అంశమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Read Also: టెన్నిస్ స్టార్‌కు షాక్.. జకోవిచ్ వీసా రద్దు
అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బెంగళూరులో జరిగే టెస్టులో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంటుందో లేదో తెలియదని సన్నీ వ్యాఖ్యానించాడు. కానీ వందో టెస్టులో అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు అందుకోవడానికి కోహ్లీ అర్హుడని.. అందుకు బీసీసీఐ అవకాశమివ్వాలని గవాస్కర్ కోరాడు. కాగా భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 12వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ఇప్పటికే వంద టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), గవాస్కర్ (125), వెంగ్ సర్కార్ (116), గంగూలీ (113), ఇషాంత్ (105), హర్భజన్ (103), సెహ్వాగ్ (103) ఉన్నారు.
