నెదర్లాండ్స్ జట్టు కాసేపు వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ బ్రాండన్ కింగ్ (91పరుగులు) చేయడంతో విండీస్ గెలుపొందింది. వన్డే సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి వన్డేలో 7వికెట్ల తేడాతో సులభంగా గెలిచిన వెస్టిండీస్, 2వ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన రెండో వన్డేలో మరో 4.3ఓవర్లు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నెదర్లాండ్స్ ఓపెనర్లు 101పరుగుల మంచి భాగస్వామ్యాన్ని అందించారు. 21వ ఓవర్‌లో మొదటి వికెట్ పడిపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ లయ దెబ్బతింది. తరువాత వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరకు 48.3ఓవర్లలో 214పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. వికెట్ కీపర్ కం బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ 89బంతుల్లో 68పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బౌలింగ్ లో వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ తన 10ఓవర్లలో 39పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు.
అయితే 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఒక దశలో 99పరుగులకే 5వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. బౌలర్ బాస్ డి లీడే ఎనిమిది ఓవర్లలో 46పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీయడంతో వెస్టిండీస్ కాస్త తడబడింది. ఇక నెదర్లాండ్స్ గెలుపు లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్.. కీసీ కార్తీతో ఇన్నింగ్స్ ను చక్కదిద్ది విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో బ్రాడన్ కింగ్ 91పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ కలిసి 118పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడంతో 45.3ఓవర్లలోనే వెస్టిండీస్ గెలుపొందింది. మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.