టీమిండియా స్టార్ ఓపెనర్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ల వివాహం వాయిదా పడింది. ఈ విషయాన్ని పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేశారు. వివాహం విషయంలో ఇరు కుటుంబాల గోప్యతను ప్రతిఒక్కరు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ‘స్మృతి మంధాన నాన్న గారికి అనారోగ్యం కారణంగా.. పలాశ్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సున్నితమైన విషయంలో అందరూ మా కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ పలాక్ పేర్కొన్నారు.
ఆదివారం స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా.. మంధాన తండ్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన స్పష్టం చేసిందని ఆమె మేనేజర్తుహిన్ మిశ్రా తెలిపారు. పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Also Read: AP Weather Report: మరో తుఫాన్ వచ్చేస్తోంది.. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఆదివారం రాత్రి పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం పలాశ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మంధాన, పలాశ్ వివాహం ఎప్పుడు జరుగుతుందో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. మంధాన పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.