Shubman Gill Admits He Had His Eyes on a Double Century: ఎకానా క్రికెట్ స్టేడియంలో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) శతకాలు బాదారు. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232 స్కోరుకు పరిమితమైంది. రహ్మత్ షా (79) టాప్ స్కోరర్. మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన భారత కెప్టెన్ గిల్ తన ఇన్నింగ్స్, శారీరక పరిస్థితి, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను 400 పరుగుల మార్క్ దాటించిన గిల్.. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయం ముఖ్యమని స్పష్టం చేశాడు.
40-45 ఓవర్లు బ్యాటింగ్ చేయడం మాటలు కాదు:
సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం వల్ల శరీరంలో అనేక చోట్ల కండరాలు పట్టేశాయని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ‘నేను క్రీజులోకి వెళ్లిన తర్వాత దాదాపు 40-45 ఓవర్లు బ్యాటింగ్ చేశాను. తీవ్రమైన ఎండలో ఆడటం వల్ల శరీరంలోని పలు భాగాల్లో క్రాంప్స్ (కండరాలు పట్టేయడం) వచ్చాయి. కొంత నొప్పిగా అనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది’ అని గిల్ తెలిపాడు. తన ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ గురించి ప్రశ్నించగా.. గిల్ స్పందించాడు. ‘ప్రస్తుతం నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను. బంతిని నేను అనుకున్న విధంగా ఆడుతున్నాను. తొలి బంతి నుంచే ఆత్మవిషవాసంతో ఆడుతున్నాను. ఈ సిరీస్‌కు ముందు నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను. మంచి ఆరంభం లభిస్తే దాన్ని భారి స్కోరుగా మార్చుకోవాలి, చివరి వరకు బ్యాటింగ్ చేయాలి అనే అలవాటు పెంచుకోవాలనుకున్నాను. అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని చెప్పాడు.
డబుల్ సెంచరీ గురించి ఆలోచించా:
డబుల్ సెంచరీ గురించి ఆలోచించారా? అన్న ప్రశ్నకు శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘అవును, డబుల్ సెంచరీ గురించి ఆలోచించాను. కానీ అదే సమయంలో జట్టు 430, 440 లేదా 450 పరుగుల దిశగా వెళ్లాలని కూడా భావించాను. అందుకే దూకుడుగా షాట్లు ఆడాల్సి వచ్చింది. నేను ఆడిన రివర్స్ స్వీప్ బాగా మిడిల్ అయ్యింది. అయితే అది నేరుగా డీప్ కవర్స్ ఫీల్డర్ చేతికి వెళ్లింది’ అని చెప్పాడు. టాస్ ఓడిపోవడం భారత్‌కు అనుకూలంగా మారిందా అనే ప్రశ్నకు.. ‘అలా నేను అనుకోవడం లేదు. ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ స్వభావం దాదాపు ఒకేలా ఉండేది. 310-320 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా అది మా బ్యాటింగ్ యూనిట్‌కు మంచి పరీక్షగా ఉండేది. అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో కూడా మేము బాగా ఆడగలమనే నమ్మకం ఉంది’ అని తెలిపాడు.
చాలా సంతోషంగా ఉన్నాను:
జట్టులోని కొత్త ఆటగాళ్లు, ముఖ్యంగా యువ బౌలర్ల ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. ‘మా జట్టులోని అందరూ మంచి మానసిక స్థితిలో ఉన్నారు. ఈ ఎండలో, ఇలాంటి పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లు నిరంతరం అదే లైన్, లెంగ్త్‌తో వేగంగా బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ వారు అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అని అన్నాడు. భారత్ బ్యాటర్లు భారీ స్కోరు నమోదు చేయగా.. బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 232 పరుగులకే కట్టడి చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. కెప్టెన్ గిల్ ఫామ్‌లో ఉండటం, యువ ఆటగాళ్లు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం భారత జట్టుకు శుభసూచకంగా కనిపిస్తోంది.

